తాడేపల్లి: గొల్లపూడిలో 15 రోజుల క్రితం ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను, వైయస్ఆర్‌సీపీ కారణమని ఆరోపిస్తూ పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మండిపడ్డారు. నిజానికి అతడి బలవన్మరణానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే కారణం. ఆ వ్యక్తి చనిపోయే ముందు చేసిన వీడియోలో కూడా తన మరణానికి కారణం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులేనని పరోక్షంగా చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ వ్యక్తి తన పార్టీకే చెందిన వారికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. అప్పులు ఇచ్చిన వారంతా దశాబ్దాలుగా టీడీపీకి పని చేస్తున్న వారే. చనిపోయిన వ్యక్తితో వైయస్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే నాకు కూడా ఆవగింజంత సంబంధం లేదు. కావాలంటే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు అని తలశిల రఘురామ్ పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా ప్రశ్నలకు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ బదులిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దాదాపు 15 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ఆయన ఆస్తి ఎవరికి రాసిచ్చారో విచారణ చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయి. అవన్నీ పక్కన పెట్టి రాజకీయ కోణంలో నాపై ఆరోపణలు చేయడం, కేసులు నమోదు చేయడం దుర్మార్గం. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి, ఎలాంటి విచారణకైనా సిద్ధం అని తలశిల రఘురామ్ స్పష్టం చేశారు.