బ్రో లెక్క తేల్చేదాకా తగ్గేదేలే

మంత్రి అంబటి రాంబాబు 

కృష్ణా: సాయి ధరమ్‌ తేజ్‌-పవన్‌ కల్యాణ్‌ నటించిన బ్రో సినిమా లెక్క తేల్చేదాకా త‌గ్గేదేలే అని మంత్రి అంబటి రాంబాబు హెచ్చ‌రించారు.  విజయవాడలో ఆయ‌న మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.    
‘‘నేను చేసినవి ఆరోపణలే అయితే.. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. 

దానకర్ణుడు, సమాజశ్రేయస్సు కోరే వ్యక్తి అని చెప్పే పవన్ ఎందుకు వాస్తవాలు దాస్తున్నాడు. తన నీతి, నిజాయితీ నిరూపించుకోవాలంటే సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌.. కట్టిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎంతో చెప్పాల్సిన అవసరం పవన్‌కు కచ్చితంగా ఉంది అని అంబటి డిమాండ్‌ చేశారు.  

బ్రో సినిమానే ఒక స్కాం
నూటికి నూరు శాతం బ్రో విషయంలో చాలా పెద్ద వ్యవహారం ఉంది. చంద్రబాబు ప్యాకేజ్ విశ్వప్రసాద్ ద్వారా అందింది. ఒక స్కామ్ మాదిరిగా ఈ ప్యాకేజ్ వ్యవహారం జరుగుతోంది. ఇదంతా వాళ్లు ఆడే గేమ్ ప్లాన్. అంకెలు చెబితే దొరికిపోతామని భయపడుతున్నారు.  అందుకే చెప్పడం లేదు అని అంబటి ఆరోపించారు.  

మమ్మల్ని గోకితే ఇలాగే ఉంటుంది
సినిమాను సినిమాలాగే చూడాలంటున్నాడు ఈ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలను సినిమాగానే తీయండి. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు?. మమ్మల్ని గోకితే .. ఇలానే ఉంటుంది. నా మీద పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసుకోండి.. నాకేం అభ్యంతరం లేదు. అందులో సాయిధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ను పెట్టి.. విశ్వప్రసాద్ తో తీయించండి. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల గురించి నేను పట్టించుకోలేదు. మీ సినిమాలు మీరు తీసుకుంటే ఏమీ ఉండదు. మమ్మల్ని గోకితే ఇలానే ఉంటుంది. ఇదే ఈ కథలో నీతి అని తెలిపారాయన.  

ఇక అంబటి ఢిల్లీ పర్యటన గురించి, దానికి బ్రో చిత్ర వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ నేను ఢిల్లీ ఎందుకు వెళ్తున్నానో చెప్పను. ముఖ్యమైన అంశం మీద వెళ్తున్నా. అక్కడ మా పార్టీ ఎంపీలను కలుస్తా’’ అని సమాధానం ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top