పది పరీక్షల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

టెన్త్‌ పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత

రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌ ఈ నెల 13 వరకు అవకాశం

జూన్‌ 2 నుంచి 10 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఫెయిల్‌ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దు

తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వండి

తాడేపల్లి:   సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విద్యారంగంలో తీసుకువ‌చ్చిన విప్ల‌వాత్మ‌క మార్పులు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. రికార్డు సమయంలో ఈసారి 18 రోజుల్లోనే టెన్త్‌ ఫలితాలు విడుదల చేశారు. ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు. పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్‌ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది.  ఫెయిల్‌ అయిన విద్యార్థులు అధైర్యపడొద్దని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులు విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వాల‌ని సూచించారు. పది ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌పై స‌మీక్షించి ప‌ది రోజుల్లో వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని, వంద శాతం ఉత్తీర్ణ‌త సాధించే దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని మంత్రి తెలిపారు.

- ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం(87.4 శాతం ఉత్తీర్ణత). 
- నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. 
- ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 

- జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు. 
- మే 17వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తులకు ఆహ్వానం. 
 
ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్‌ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్ష­లకు హాజర­య్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు.  

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో ఏప్రిల్‌ 03 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ పూర్తి చేశారు.

Back to Top