రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగు 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలిస్తాం

సాగునీరు అందించేందుకు పుష్కలంగా నీరందిస్తాం 

గత ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్రమైన కరువు కాటకాలు

రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తాం

వైయస్‌ఆర్‌ జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎదుర్కొనేలా కలెక్టర్లకు ఆదేశాలు

ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు

అమరావతి: రాష్ట్రంలో మనసున్న రైతు ప్రభుత్వం అధికారంలో ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులే ఉన్నారని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి ప్రసంగం ఇలా..
రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షభావం నేపథ్యంలో మన ప్రభుత్వం ఏం చేస్తామన్నది మొట్ట మొదటి రోజు సభ ముందు ఉంచుతున్నాను. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 135.5 మిల్లిమీటర్లు నమోదు కావాల్సి ఉండగా కేవలం 71 మిల్లిమీటర్లు మాత్రమే నమోదు అయ్యింది. సాధారణంగా ఖరీఫ్‌లో 42 లక్షల పంటలు పండుతాయి. ఏటా జూన్‌ నుంచి జులై 10 నాటికి సగటున 9.10 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు వేస్తారు. ఈ ఏడాది కేవలం 3.2 లక్షలహెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వర్షాలు ఆలస్యమయ్యాయి. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటిని అన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభలో ఉంచుతున్నాను. మేం అ«ధికారంలోకి వచ్చి కేవలం 45 రోజులు మాత్రమే. అయినా సరే ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ సభలో చాలా మందికి ఈ విషయాలు గుర్తు ఉండే ఉంటాయి. 2013–2014లో ఒక వైపు తీవ్రమైన కరువు, మరోవైపు తుపాన్లతో రాష్ట్రం అల్లకొల్లలమైంది.

ఆధికారంలోకి వచ్చిన టీడీపీ ఆదుకుంటామని మాటి ఇచ్చి..రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. గత ప్రభుత్వం దారుణమైన మోసాలు ఎలా చేశారో అందరం చూశాం. గత ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదేళ్లలో తీవ్రమైన కరువు చూశాం. గతేడాది తీవ్రమైన కరువును చూశాం. ఒక్క ఖరీఫ్‌లోనే గతేడాది అక్షరాల 1838 వేల కోట్ల నిధులు కరువును ఎదుర్కొనేందుకు అవసరమైని గత ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అవసరమని చెప్పారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా డబ్బులు వచ్చాయి. పంట నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపన పోలేదు. గత ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదు. ఎప్పుడు ఇవ్వాలన్నది కాస్త అవగాహన వచ్చేలా చెబుతాను. ఈ సంవత్సరం జూన్‌లో విత్తనాలు వేయాలంటే దాని అర్థం ఖరీఫ్‌ ప్రారంభమైందని అర్థం. ఏప్రిల్‌ నాటికి విత్తనాల సేకరణ పూర్తి అయి, మే నెలలో విత్తనాలు పంపిణీ చేయాలి. మేం అధికారంలోకి వచ్చే నాటికి విత్తనాల పంపిణీ జరగాలి. అలా జరుగకపోవడంతో రైతులు రోడ్డుపైకి వచ్చారు.

మేం బాధ్యతలు స్వీకరించిన నాటికి 4.1 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది. తీరా చూస్తే కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మేం అధికారులను అడిగితే వారు లేఖను చూపించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ నుంచి నిధులు విడుదల చేయలేదని అధికారులు లేఖ రాశారు. నిధుల కోసం ఎన్నిమార్లు అధికారులు లేఖలు రాసినా గత ప్రభుత్వం స్పందించలేదు. చేయాల్సిన పని సకాలంలో చేయలేకపోయారు. మేం ఏం చేయాలేకపోయామని అధికారులు చెబుతుంటే బాధనిపించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. అక్షరాల రూ.384 కోట్లు విత్తన బకాయిలు ఉన్నాయి. అవి కూడా  ఇవ్వని పరిస్థితి ఉంది. రైతుల జీవితాలతో ఆడుకున్నారని అధికారులే చెబుతున్నారు. కరువు సంవత్సరాల్లో కనీసం వడ్డీ చెల్లింపులు చేయలేకపోయారు. రుణాల రీషెడ్యూల్‌కు ఏ ప్రభుత్వమైనా ముందుకు రావాలి. గతంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా రాలేదు. తీవ్ర కరువులో ఉన్న ఎలాంటి రీ షెడ్యూల్‌ రుణాలు లేవు. మొన్న ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో అధికారులు చెప్పింది చూస్తే బా«ధనిపించింది. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఉన్నాయి. ఈ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. ఆ నాటి వీడియోలు అసెంబ్లీలో ప్లే చేస్తూ నాటి హామీలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని రైతులను గత ప్రభుత్వం మోసం చేసింది. రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ సొమ్మును గత ప్రభుత్వం కట్టకుండా ఆ పథకాన్నే రద్దు చేశారు. కేవలం 24 వేల కోట్ల రుణాలకు కత్తిరించారు. అందులో కూడా రూ.15 వేల కోట్లు కూడా చెల్లించలేదు. ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం రైతులపై రుణభారం రూ.1,49,240 కోట్లకు ఎగబాకింది. రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం నెల రోజుల్లోపే ఏం చర్యలు తీసుకుందన్నది గర్వంగా చెబుతున్నాను.

రైతులకు కోసం కొత్త పథకాన్ని ప్రకటించాం. వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం..బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ.84 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. గడువు లోగా తిరిగి చెల్లిస్తే ఆ వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వడ్డీ వ్యాపారుల కంబంద హస్తల నుంచి విముక్తి చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టాం. ఇచ్చిన మాట ప్రకారం 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇ స్తున్నాం. 40 శాతం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. దీని కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తే కూడా పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇవ్వలేమని అధికారులు చెబితే..ఆ అధికారులు చెప్పిన మేరకు రూ.1700 కోట్లు వెంటనే విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే జూన్‌ నాటికి పూర్తి స్థాయిలో పగటి పూట విద్యుత్‌ ఇస్తాం. 
ఇచ్చిన మాట ప్రకారం ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్‌ కరెంటు ఇస్తున్నాం. రూ.700 కోట్ల మేర ఆక్వా రైతులకు మేలు జరుగుతుంది. అలాగే వైయస్‌ఆర్‌ ఉచిత పంటల భీమా పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా 50 లక్షల మంది రైతుల తరఫున రూ.2 లక్షల కోట్ల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. శనగ రైతులను ఆదుకునేందుకు రూ.330 కోట్లు విడుదల చేశాం. ఈ మొత్తాన్ని ఇప్పటికే పంపిణీ చేస్తున్నాం. మొన్న జమ్ములమడుగులో చెక్కుల పంపిణీ కూడా చేశాం. తెలంగాణ బార్డర్‌లో ఉన్న ఫామ్‌ అయిల్‌ రేట్‌ తెలంగాణలో వెయ్యి ఎక్కువగా ఉంది. మనకు వెయ్యి తక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చుతూ..అయిల్‌ఫామ్‌ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ రూ.80 కోట్లు విడుదల చేశాం. దీనివల్ల 1.10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. 

పోగాకు ధరలు పడిపోతున్న తరుణంలో వెంటనే స్పందించాం. గతంలో జగన్‌ అనే వ్యక్తి ధర్నా చేస్తేనే ధరలు పెంచేవారు. ఇప్పుడు మా ప్రభుత్వం వెంటనే స్పందించింది. పోగాకు రేటు పెంచి కొనుగోలుకు శ్రీకారం చుట్టాం. ప్రతి జిల్లాలోనూ వివిధ నియోజకవర్గాల్లో పంటల ధరలు ఎలా ఉండాలో తెలుసుకునేందుకు, ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు మార్కెట్‌ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేను గౌరవ చైర్మన్లుగా  నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఏ పంటకు ఏ రేటు ఉంది. రైతు పరిస్థితి ఏంటీ అన్నది ఎమ్మెల్యేలు ఆ మీటింగ్లో పాల్గొని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తెస్తారు. 

గత ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలు రూ.384 కోట్లు కూడా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ధాన్యం సేకరణకు రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. ఆ మొత్తం కూడా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా రూ.360 కోట్లు విడుదల చేశామని గర్వంగా చెబుతున్నాను. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయిలు కూడా రూ.2 వేల కోట్లు మా ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నాను. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీ రద్దు చేస్తామని చెబుతున్నాను. నెల రోజుల్లోనే వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి నెల ఈ మిషన్‌ సమావేశం నిర్వహించి, క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
ప్రమాద వశాత్తు రైతు ఆత్మహత్య చేసుకున్నా..మరణించినా గతంలో పట్టించుకునే పరిస్థితి లేదు.

గత ప్రభుత్వ డిస్ట్రిక్‌ క్రైమ్‌ రికార్డు లెక్కల ప్రకారం 1510 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 300 మందికి మాత్రమే అంతో  ఇంతో ఇచ్చారు. మా ప్రభుత్వం వారందరికి రూ.7 లక్షల చొప్పున చెల్లించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. రైతుల సంక్షేమం కోసం కేవలం నెల రోజుల్లోనే మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి.
ఈ ఏడాది మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇలా..ఏ ప్రభుత్వం చేయని విధంగా మరో పథకం తీసుకువస్తున్నాం. తుపాన్లు, కరువులు వచ్చినా రైతులను ఆదుకునేందుకు వెంటనే ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేయబోతున్నాం.

60 శాతం జనాభా రైతులు ఉన్నారు. ఇంతమంది కష్టాల్లో ఉంటే రాష్ట్రం ఎలా బాగుంటుందని నన్ను నేను ప్రశ్నించుకున్నాను కాబట్టే రైతులకు మేలు చేయాలని పథకాలు రూపొందించాం. అందులో నుంచి రైతు భరోసా పథకం రూపొందించాం. ప్రతి రైతుకు రూ.12,500 ఈ అక్టోబర్‌ నుంచి అందించాలని చెబుతున్నాను. ఈ రబీ సీజన్‌ నుంచే ఈ పథకం అమలు చేస్తున్నాను. రైతుల పరిస్థితి ఇవాళ దారుణంగా ఉంది. భూమి విస్తీర్ణం కేవలం 1.25 ఎకరాలు మాత్రమే. ఒక హెక్టార్‌(2.50ఎకరాలు) రాష్ట్రంలో 70 శాతం మంది ఉన్నారు. ఇలాంటి రైతులకు ఈ సహాయం చాలా అవసరమవుతుంది. రాష్ట్రంలో 70 లక్షల రైతు, కౌలు రైతులకు  అందజేయబోతున్నాం. ఒకే విడతలో రైతుల చేతికి అందించడం ఏపీ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఇదే రికార్డు అవుతుంది. ఇచ్చే ఈ సొమ్మును బ్యాంకులు రైతుల పాత బకాయిలకు జమా చేసుకోకుండా ఒక నిబంధన తీసుకువస్తాం. భూ యాజమాన్య హక్కులను కాపాడుతాం. కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకువస్తాం. రైతుల్లో ఎలాంటి అభద్రతా భావం లేకుండా చేస్తాం. ఇదే సమావేశాల్లోనే ఇవన్నీ కూడా చేయబోతున్నాం.

 సహకార రంగాన్ని పునరుద్ధరించబోతున్నాం. మూతపడిన అన్ని పరిశ్రమలను పునరుద్ధరిస్తామని చెబుతున్నాను. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుడుతాం. మా ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే ఈ కార్యక్రమాలు ప్రతి నియోజకకవర్గంలోనూ, మండల కేంద్రాల్లోనూ గోడౌన్లు నిర్మిస్తామని చెబుతున్నాను.
రైతులు కొంటున్న విత్తనాలు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి నియోజకవర్గంలో ల్యాబోరేటరీలు ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు నేరుగా గ్రామ స్థాయిలో విక్రయించేలా చర్యలు తీసుకోబోతున్నాం. 

ఇదే చట్టసభలోనే చట్టాలను సవరించబోతున్నాం. కల్తీ అన్నదిఎక్కడా కూడా లేకుండా ఉండేందుకు చట్టాలను రూపొందిస్తాం. కొబ్బరికి కనీస మద్దతు ధరకు చర్యలు తీసుకోబోతున్నాం.
గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలించేందుకు గొప్ప కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది ఒక చరిత్ర. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడమే కాకుండా 200 రిగ్గులు కొనుగోలు చేసి అడిగిన ప్రతి ఒక్కరికి బోర్లు వేస్తామని ప్రకటిస్తున్నాను. వైయస్‌ఆర్‌ జలయజ్ఞం ద్వారా సకాలంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అన్నీ కూడా అవినీతిమయం అయ్యాయి. ఈ వ్యవస్థలో మార్పులు తెస్తాం. అవినీతి జరిగిన ప్రతి చోట రివర్స్‌ టెండరింగ్‌కు పిలుస్తాం. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎలా ప్రవహింపజేయాలో చేసి చూపిస్తాం.

సహకార రంగంలోని డయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.4 బోనస్‌ ఇస్తాం. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ప్రతి రైతుకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 
నీటి ఎద్దడి, కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నీటి కొరత ఎక్కడ కూడా రాకుండ ఉండేందుకు ఎంత డబ్బు ఖర్చైనా కూడా ఏర్పాటు చేయండని కలెక్టర్లకు చెప్పాం. మరో అడుగు ముందుకు వేస్తూ..ఇంతకు ముందు పాలకులకు ఆ మనసు లేదు. నీటి విలువ, ప్రజల కష్టాలు తెలిసిన మనసున్న ప్రభుత్వంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేకు కోటి రూపాయలు కేటాయిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గాల్లో పర్యటించి నీటి ఎద్దడి నివారణకు ఈ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి. ప్రతి ఎమ్మెల్యే చేతిలో కోటి డబ్బు పెట్టి ప్రభుత్వం మీ వెంటే ఉంటుందన్న మాట గతంలో ఎప్పుడు చూడలేదు. ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలకు కూడా కోటి  ఇస్తానని చెబుతున్నాను. ఈ నిధులు డైరెక్టుగా సీఎం డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచే ఇస్తున్నాను. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదన్నది మా ప్రభుత్వ విధానం. గత ప్రభుత్వానికి భిన్నంగా నిధులు కేటాయిస్తాం. చంద్రబాబుకు కూడా కోటి రూపాయలు కేటాయిస్తున్నాం. ప్రజలు మంచి చేయమని కోరుతున్నాం.

పశువులకు కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. వచ్చే రబీలో విత్తనాల సేకరణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాయలసీమ జిల్లాల్లో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఒక్క ట్యాంకర్‌కు రూ.600 ఇస్తాం. ఇదే బడ్జెట్లో రూ.2 వేల కోట్ల ప్రకృతి వైఫరిత్యాల నిధిని ఇదే ఏడాది అందుబాటులోకి తెస్తాం. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కరువే వస్తే..గతంలో ఎప్పుడు జరగని విధంగా రుణాల వడ్డీలు ప్రభుత్వమే భరిస్తుంది. గత ప్రభుత్వంలో కరువు చూశాం. ఏ రోజు కూడా వడ్డీలు మేమే కడుతామని ఎప్పుడు అనలేదు. ఇవన్నీ కూడా మార్చబోతున్నాం. కరువు సమయంలో ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
ఇంకా ఏమైనా ప్రతిపక్ష సూచనలు ఇస్తే..మంచి మనసుతో  ఇవన్నీ కూడా స్వీకరిస్తానని సలహాలు ఇవ్వాలని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
 

Back to Top