పరిశ్రమలు పెట్టేందుకు ఏపీ అనువైన ప్రాంతం

అవినీతికి తావులేకుండా పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాం

పారిశ్రామికవేత్తలను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం

మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: పరిశ్రమలు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన ప్రాంతమని, కావాల్సిన వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల సముద్రతీరం, విస్తారమైన రైలు మార్గం, రోడ్డు కనెక్టివిటీ, నాలుగు సీ పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్ట్స్‌ ఉన్నాయన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనివిని ఎరుగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రంలో ఉంది. 86 శాతం అసెంబ్లీ సీట్లు గెలుచుకొని సుస్థిర ప్రభుత్వం ఏపీలో ఉంది. ఏపీలోనే కాకుండా దేశంలోనే  22 ఎంపీలతో నాల్గవ అతిపెద్ద పార్టీగా నిలిచామని సీఎం అన్నారు. మేధోమథన సమీక్షలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 
 
గతంలో ఇండస్ట్రీయిల్‌ రాయితీలు ఇవ్వాలంటే గత ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టజెబితే తప్ప ఇండస్ట్రీయల్‌ రాయితీలు రానిపరిస్థితి. కానీ, మా పాలనలో గర్వంగా చెప్పాల్సిన మాట ఒకటుంది.. అవినీతికి తావులేకుండా పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఎవరూ లంచాలు అడగరు. పరిశ్రమలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. వచ్చేవాటిని స్వాగతిస్తున్నాం. 

వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకువచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో టెండర్లు జరిగే ముందు  అవి న్యాయమూర్తి ముందు పెడుతున్నాం. ఆ తరువాతే టెండర్ల ప్రక్రియకు వెళ్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని తీసుకువచ్చాం. ఎవరైనా టెండర్లలో పాల్గొన్న తరువాత ఎల్‌1 ఎవరికైనా వస్తే.. ఆ ఎల్‌1 కన్నా ఇంకా తక్కువ రేట్‌కు వేయడానికి టెండర్‌ వేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే రివర్స్‌టెండరింగ్‌ చేపడుతున్నాం. 

లా అండ్‌ ఆర్డర్‌ పరంగా దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ వ్యవస్థ ఆంధ్రరాష్ట్రంలో ఉంది. గ్రామ సచివాలయంలో కూడా మహిళా కానిస్టేబుల్‌ను నియమించాం. గ్రామస్థాయి వరకు అత్యంతబలమైన పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు ఫార్మా, చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీ గింజలు అన్నీ కలిపి రూ. లక్ష కోట్ల ఎగుమతులు చేసే పరిస్థితిలో ఏపీ ఉంది. 

ఏపీలో విద్యుత్‌ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది. బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ గ్రామస్థాయి వరకు ఉంది. అవసరాలకు తగినట్టుగా పారిశ్రామిక వేత్తలకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వనరులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగునీటి అవసరాల కోసం వాటర్‌ గ్రిడ్‌ దగ్గర నుంచి సాగునీటికి కెనాల్‌ సిస్టమ్‌ నుంచి పారిశ్రామిక అవసరాల కోసం నీటిని ఇచ్చే విధంగా యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం’ అని వివరించారు. 
 

Back to Top