కర్నూలులో తోక కట్‌ చేస్తే ఇక్కడికొచ్చావ్‌..!

ఇక్కడి ప్రజలు తోకకట్‌ చేసి సున్నం పెట్టే రోజొస్తుంది

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అనంత వార్నింగ్‌

కూటమి నేతలకు జగన్‌ ఫోబియా..!

ఏడాదికే ఎమ్మెల్యేలకు ప్రజల నాడి తెలిసిపోయింది..!

ఇప్పటికే రెడ్‌జోన్‌లో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు

గుమ్మనూరు జయరాం కూడా రెడ్‌జోన్‌లోనే..!

జయరాం బెదిరింపులకు ఎవరూ భయపడరు

పరిటాల కుటుంబం కూడా రప..రప..అంటే ఎలా?

వాళ్ల పొలిటికల్‌ ఎంట్రీ ఎలా జరిగిందో తెలియదా?

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌

స్థానిక ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంటుందని స్పష్టీకరణ

అనంతపురం:  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలకు అనంత వెంకటరామిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెడ్‌ బుక్‌ ద్వారా హింసా రాజకీయాలు చేస్తానంటున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘అనంతపురం జిల్లాలో మేం చాలా మందిని చూశాం. పరిటాల వంటి వాళ్ల దౌర్జన్యాలను చూశాం. అన్నీ తట్టుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వెళితే  ప్రజలు తీర్పులు కూడా ఇచ్చారు. గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం మాట్లాడిన మాటలేంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ నుంచి ఎవరూ పోటీ చేయకూడదు.. ఎన్నికలకు ముందే సరెండర్‌ కావాలి.. లేకపోతే తోలుతీస్తాం.. తాటతీస్తాం అంటారా? కర్నూలు జిల్లాలో నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. చివరకు అక్కడ తోక కట్‌ చేశారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో ఈ జిల్లాకు వచ్చావ్‌. అనంతపురం జిల్లా వాళ్లను తక్కువ అంచనా వేయద్దు. ఈ జిల్లాలో కూడా ప్రజలు నీ తోకకట్‌ చేసి సున్నం పెడతారు. చివరకు ఎక్కడా కాకుండాపోతావ్‌..!’’ అని అనంత హెచ్చరించారు. 

‘‘ఇటీవల ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓ సంస్థ సర్వే చేస్తే 53 మంది ఎమ్మెల్యేలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు వచ్చింది. అందులో నువ్వూ (గుమ్మనూరు జయరాం) ఉన్నావ్‌..! నీ పరిస్థితి అది. గుంతకల్లు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండేది. అనంతపురం జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి స్థిరపడ్డారు. అలాంటి చోటికి అరాచక శక్తులు వచ్చారు. ఇటీవల జర్నలిస్టులను కూడా జయరాం బెదిరించారు. రైలు పట్టాలపై పడుకోబెడతారన్నావు.. నీ నోటికి అదుపు లేదా? గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో కుటుంబ సభ్యులను షాడో ఎమ్మెల్యేలుగా పెట్టావ్‌.. ఇసుక నుంచి అన్నింట్లో దోపిడీ చేస్తున్నావు. గుంతకల్లులో పేకాట, మట్కా విచ్చలవిడిగా సాగుతోంది’’ అని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. 

కూటమి ఎమ్మెల్యేలకు వైయ‌స్ జగన్‌ ఫోబియా
రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలకు జగన్‌ ఫోబియా పట్టుకుందని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ సహా అందరూ తమకు ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్నారన్నారు. ఏడాదిలోనే ప్రజల నాడి తెలిసిపోవడంతో అందరూ ఫ్రస్టేషన్‌లోకి వెళ్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్న ఆలోచన చేయకుండా ఏడాదిగా అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతున్నారన్నారు. కక్షసాధింపు చర్యలు, రాజకీయంగా అణచివేయాలన్న ధోరణలో వెళ్తున్నారని తెలిపారు. రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తే అనేక ఆంక్షలు పెడుతున్నారని, ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వక్రీకరణలు చేస్తున్నారన్నారు. ‘‘నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాలుగు సార్లు సీఎం అయ్యాను. నేను అందరికీ ఆదర్శం అని చెప్పుకునే చంద్రబాబు కూడా దిగజారి మాట్లాడుతున్నారు. వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని, వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తాం అంటున్నారు. సీనియర్‌ నాయకుడు బుచ్చయ్య చౌదరి అంటే మాకు గౌరవం ఉండేది. చివరకు అలాంటి వ్యక్తి కూడా వైయ‌స్ జగన్‌ తల నరకాలి అంటున్నారు. ఓ సినిమా డైలాగ్‌ను ఎవరో ప్లకార్టు ప్రదర్శిస్తే విపరీత అర్థాలు తీస్తున్నారు’’ అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను జైళ్లలో పెట్టారని, ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు అక్షింతలు వేసినా మారడం లేదన్నారు. 

పరిటాల చరిత్ర అందరికీ తెలిసిందే..!
జిల్లాలో పరిటాల చరిత్ర అందరికీ తెలిసిందేనని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ‘‘ఈ రోజు పరిటాల కుటుంబం కూడా రప..రప..అని మాట్లాడుతున్నారు. మీ రాజకీయ ఎంట్రీ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబే భూస్థాపితం అంటూ మాట్లాడుతుంటే వాళ్ల పార్టీ వాళ్లు అంతకంటే ఘోరంగా తయారవుతున్నారు. భవిష్యత్‌లో ఇదే ధోరణి కొనసాగితే అంతా మేమే అన్నట్లు వ్యవహరిస్తారు. ఇప్పటికే పోలీస్, రెవన్యూ వ్యవస్థలను చేతుల్లోకి తీసుకున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అని లోకేష్‌ చెప్పినా..జయరాం చెప్పినా ఉన్న రాజ్యాంగం ఒక్కటే..! అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్‌ అంటే సుమోటోగా తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది’’ అని అనంత అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థం అవుతోందని, ప్రజల నాడి తెలుసు కాబట్టే దౌర్జన్యాలు చేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి, నేతలకు భవిష్యత్‌ లేకుండా ప్రజలు సున్నం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతినాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, నగర అధ్యక్షుడు శ్రీనివాస్‌ దత్త, ఉపాధ్యక్షుడు ఉదయ్, ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Back to Top