మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. కానీ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రజల పల్స్ ని పట్టి ఇచ్చేసాయి. కులమీడియాలు చేసిన ఆక్టోపస్ సర్వేలు పక్కన పెడితే అసలైన సర్వేలు, జాతీయ సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. తెలుగు ప్రజలు వైఎస్ జగన్ కు జై కొట్టారన్న నిజాన్ని చాటి చెప్పాయి. ప్రజల నిర్ణయం తెలిసిపోయింది. జరగాల్సింది ఒక అధికారిక ప్రకటనే. విజయతీరం లేదిక దూరం అనే ఈ సందర్భంలో కొన్ని విషయాలు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. నాయకత్వం అతడి లక్షణం పువ్వుకు వికాసం ఎవ్వరూ నేర్పక్కర్లేదు. సూర్యుడికి ఉదయించేందుకు సాయం అవసరం లేదు. స్వతహాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలే అతడిని గొప్ప నేతగా తీర్చి దిద్దాయి. అందరిపట్లా అభిమానం, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వదులుకోని స్వాభిమానం అతడి ఆస్తులు. సంస్కారంలో తండ్రికి వారసుడు. ప్రజల మనిషిగా నిలవడంలో వైఎస్సార్ ఆశయ సాధకుడు. ఇది కొందరి మాట కాదు ఈ రాష్ట్ర ప్రజలందరి మాట. వారి ఆశీర్వాదాలతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ అడుగడుగులో ఆంధ్రావని ఆశలకు ప్రతినిధిగా నిలిచారు. పదేళ్లు ప్రతిపక్షంలో క్లిష్టమైన పరిస్థితులు, రాష్ట్ర విభజన, అవినీతి ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రి, అమలు కాని పథకాలు, అధికారపార్టీ మోసాలు ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వీటన్నిటిపై ఎడతెగని పోరాటం చేసారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన వెంట నడిచేవారికి తన నడవడినే ఓ దిక్సూచిగా మార్చారు. రాజకీయాలకు విలువలు నేర్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే నాయకుడే కావాలని నినదించారు. తాను అలా ఉంటా అని ప్రజల సాక్షిగా ప్రమాణం చేసారు. పదేళ్ల ప్రతిపక్ష కాలంలో హోదా ఉద్యమం నించి వంచనపై గర్జన వరకూ ప్రజలపక్షమై నిలిచారు. సవాళ్లను స్వీకరిస్తూ వైఎస్ జగన్ అతడి రాజకీయ జీవితం పూలపాన్పు కాదు. ముఖ్యమంత్రి కుమారుడిగా కంటే దిల్లీ పెద్దమ్మను ఎదిరించిన ధీరుడిగానే దేశం అతడిని గుర్తిస్తోంది. ఆ వ్యక్తిత్వమే అతడికి సవాళ్లను ముందుపెట్టింది. కుట్రలు, అక్రమ కేసులు, ఏడాదిపాటు జైలు నిర్బంధం, ఆధారాలు లేని ఆరోపణలు, అతడి వ్యక్తిత్వంపై బురదచల్లడం, కుంటుంబాన్నిటార్గెట్ చేయడం, చివరకి హత్యాయత్నం....ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా అతడి ధైర్యం సడలలేదు. పెదవులపై చిరునవ్వు చెదరలేదు. ఆవేశంతో రగిలిపోలేదు. చట్టం, న్యాయం, దేవుడు, ప్రజాతీర్పు ఇవే అంతిమంగా తనను జడ్జ్ చేస్తాయని నమ్మాడు. జనమే జగనై వైఎస్ జగన్ నమ్మకం వమ్ము కాలేదు. అతడి ఆత్మవిశ్వాసం వెయ్యింతలయ్యేలా ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. రాజకీయాలకు కొత్త గతిని చూపిస్తానని, నవరత్నాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోతానని నిబ్బరంగా చెప్పిన ఆ నాయకుడి ముందు ఇప్పుడు గెలుపు తలుపు తెరుచుకుంది. ఆంధ్రావని ఆత్మీయంగా ఆ యువనేతకు ఆహ్వానం పలకబోతోంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎ గ్రేట్ లీడర్.