తిరుపతి: తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని వందల ఎకరాల్లో ఉన్న సిలికా నిక్షేపాలను కొల్లగొట్టేందుకు కూటమి పెద్దలు పెద్ద స్కెచ్ వేశారు. ఇప్పటికే కూటమి నేతలు ఇక్కడి ఇసుక, క్వార్ట్ ్జను అక్రమ మార్గాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు సిలికా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. తొలుత సిలికా మైన్స్‌ను మూడు బడా సంస్థలకు కట్టబెట్టాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆ సంస్థల ప్రతినిధులు స్థానిక లీజుదారులను లొంగదీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ బడా సంస్థ ప్రతినిధులు కొద్ది రోజులుగా చిల్లకూరు ప్రాంతంలోని ఓ హోటల్‌లో మకాం వేసి ఇక్కడి లీజుదారులను పిలిపించి తమకే సిలికా మైన్‌లను ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. గతంలో పరిశ్రమల పేరుతో తీర ప్రాంతంలో సిలికా ఉన్న భూములు దక్కించుకున్న ఈ సంస్థ మైనర్ మినరల్ పేరుతో జీవో తెప్పించుకుంది. అధికంగా సిలికా భూములు తమ దగ్గరే ఉన్నాయి కాబట్టి సిలికా తవ్వకాలను పూర్తిగా తమకే అప్పగించాలని ఇతర లీజుదారులపై ఒత్తిడి తెస్తోంది. నలుగురు ప్రజాప్రతినిధులను అన్నీ తానై నడిపించే మరో సంస్థకు చెందిన బడా బాబు లీజుదారులను చెన్నైకి పిలిపించి గనులు ఆయనకు అప్పగించాలని తెగేసి చెబుతున్నారు. తాజాగా అధిష్ఠానం ఓ మెలిక పెట్టింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సిలికా వ్యాపారం చేసిన సంస్థకే అన్ని గనులు అప్పగించి, మిగిలిన రెండు సంస్థల వారిని కలుపుకొని పోయేలా చూడాలని చెబుతున్నట్లు సమాచారం. ఈ మూడు సంస్థలో ఒక దానికి గతంలో వ్యాపారం చేసిన అనుభవం ఉంది. మరో సంస్థ చేతిలో అధిక శాతం సిలికా ఉన్న భూములున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులకు పెద్ద ఇంకొకరు. ఈ మూడు సంస్థలకు అప్పజెబితే ఏ ఇబ్బందీ లేకుండా సిలికా తరలించేయొచ్చన్నది కూటమి పెద్దల ప్రణాళికగా చెబుతున్నారు. ప్రజాప్రతినిధి టోకెన్ ఇచ్చినవారికే డీలర్‌షిప్ టమి పెద్దలు సిలికా వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నాలు చేస్తుండటంతో దాని ప్రభావం డీలర్లపైనా పడింది. ఏడు నెలలుగా వారికి వ్యాపారమే సాగడంలేదు. పది రోజుల క్రితం గనుల శాఖాధికారి 50 మంది డీలర్లకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు సగం మందికి కూడా అనుమతులు ఇవ్వలేదని సమాచారం. పైకి సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారు. అన్ని షరతులకు తలొగ్గి, స్థానిక ప్రజాప్రతినిధి దగ్గర టోకెన్ తీసుకున్న వారికి మాత్రమే గనుల శాఖాధికారులు పిలిచి అనుమతులు జారీచేస్తున్నట్లు తెలుస్తోంది. పేదల భూముల పైనా కన్ను తీర ప్రాంతంలో బల్లవోలు గ్రామ పేదలకు 40 ఏళ్ల క్రితం పంపిణీ చేసిన భూములపైనా సిలికా లీజుదారుల కన్ను పడింది. గత ప్రభుత్వం ఈ భూముల్లోకి లీజుదారులు రాకుండా అడ్డుకొంది. పేదలు కూడా కోర్టును ఆశ్రయించి సాగు భూముల్లో తవ్వకాలు చేపట్టకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే లీజులు పొందిన ఓ మహిళ తాజాగా నెల్లూరు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ పెద్దల ద్వారా జాయింట్ ఇన్‌స్పెక్షన్ పేరుతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం గనుల శాఖ, రెవెన్యూ శాఖలోని పలువురికి పెద్ద మొత్తంలో ముడుపులివ్వడం, కూటమి పెద్దల అండ కూడా ఉండటంతో వారు కూడా సహకారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.