తూతూ మంత్రం..రెవెన్యూ యంత్రాంగం

ఫలితం లేని రెవెన్యూ సదస్సులు.. మళ్లీ కలెక్టరేట్లకు జనం పరుగులు

అందిన అర్జీలు 1.75 లక్షలు.. సదస్సుల్లో పరిష్కరించినవి 12 వేలు

అవే సమస్యలతో పరిష్కార వేదికల వద్దకు పోటెత్తుతున్న బాధితులు

రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల తరలింపు

వైఎస్సార్‌ సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తూ వాటిని స్వీకరించేందుకే ప్రాధాన్యం

ఇతర సమస్యలు పరిష్కరించేందుకు ఆసక్తి చూపని అధికారులు

కేవలం విద్యార్థుల సర్టిఫికెట్‌ సమస్యల పరిష్కారానికే పరిమితం

సీఎంను కలిసి ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాక జనం అగచాట్లు  

 అమరావతి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని  ప్రచా­రం చేసిన కూటమి సర్కారు వాటిని మొక్కుబడి తంతుగా మార్చి తుస్సుమనిపించింది. లక్షల్లో ఫిర్యాదులు అందుతున్నా వేలల్లో కూడా పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఉసూరుమంటూ కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలకు అవే సమస్యలతో పోటెత్తుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీహయాం­లో అమలు చేసిన భూ సంస్కరణలను నిలిపి­వేసిన కూటమి ప్రభుత్వం వాటిపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. 

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ రెవె­న్యూ సదస్సులు చేపట్టింది. తూతూమంత్రంగా నిర్వహిస్తుండటంతో స్థాని­కుల భాగస్వామ్యం పెద్దగా ఉండడం లేదు. పెద్ద గ్రామాల్లో నిర్వహించే సభల్లోనూ 30, 40 మందికి మించి ప్రజలు కనపడడంలేదు.  దీంతో కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చేవారిని సభల్లో కూర్చోబెట్టి ఫొటోలు తీసి పంపుతున్నారు. 

అసలు ఈ సభలను అధికారులే సీరియస్‌గా తీసుకోవడం లేదు. షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల్లో ఎలాగోలా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఓ మోస్తరుగానైనా జనం వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన చోట వాటికి పరిష్కారం కనిపించడంలేదు. కేవలం తాము పరిష్కారం చూపించగలమన్న అంశాలకు సంబంధించిన వినతులను మాత్రమే అధికారులు స్వీకరిస్తున్నారు. భూ వివాదాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ప్రస్తావిస్తే కోర్టుకు వెళ్లాలని, అది తమ పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారు.  

గన్నవరంలో గబగబ..
కృష్ణా జిల్లా గన్నవరంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగిన తీరును  పరిశీలించగా పట్టుమని 20 మంది కూడా పాల్గొన లేదు. భూముల సమస్యలు అత్యధికంగా ఉండే గన్నవరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సభలో ఇతర పనుల మీద వచ్చిన వారిని కూర్చోబెట్టారు. సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన వారిలో చాలా మంది టీడీపీ సానుభూతిపరులే. గ్రామాలకు సంబంధించి పార్టీ పరమైన సమస్యలను వారు ప్రస్తావించారు. గత సర్కారుపై నిందలు మోపడం, ఈ ప్రభుత్వం ఏదో చేసేసినట్లు చెప్పుకోవడానికి  ఆరాట పడ్డారు. తహశీల్దార్, ఇతర అధికారులు ప్రసంగించిన అనంతరం వినతులు స్వీకరించారు. ఇదంతా కేవలం గంటన్నరలోనే ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగాల్సిన కార్యక్రమాన్ని తూతూమంత్రంగా జరిపారు.

తప్పుడు ఆరోపణలతో.. సీఎంను కలిసినా ఏం లాభం? 
పలు చోట్ల రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వారంతా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలతో అందచేసే వినతి పత్రాలను స్వీకరిస్తూ నమోదు చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు ప్రస్తావిస్తూ ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.  

సమస్య ఏదైనా సరే వైయ‌స్ఆర్‌సీపీ బాధితులమని చెప్పాల్సిందిగా ఫిర్యాదుదారులకు టీడీపీ నేతలు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇలాగే పలువురిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తరలించి సీఎం చంద్రబాబు, మంత్రులకు విజ్ఞాపనలు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బాధితులమని, కబ్జా చేశారని చెబితేనే ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. నిజానికి నేరుగా సీఎం చంద్రబాబుకు అందచేసే విజ్ఞాప­నలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన్ను కలిసిన వారు వాపోతున్నారు.   

లక్షల్లో ఫిర్యాదులు.. 
ఇప్పటివరకు 12,862 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయి. సోమవారం వరకు 1,75,182 వినతి పత్రాలు అందగా 12,409 అర్జీలను పరిష్కరించారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత మొక్కుబడిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత నెల 6న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రోజూ 800 నుంచి వెయ్యి గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ చెబుతోంది.  

జనం లేక వెలవెలబోతున్న సభలో మాట్లాడుతున్న గన్నవరం తహసీల్దార్‌ 

సదస్సులతో ఫలితం లేక కలెక్టరేట్లకు..
⇒ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. మొదటి రెండు మూడు రోజులు హడావుడి చేసి ఆ తరువాత వదిలేశారు. సదస్సుల్లో ఇప్పటి వరకు 9,155 అర్జీలు నమోదు కాగా కేవలం 142 మాత్రమే పరిశీలించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు అర్జీలతో పోటెత్తుతున్నారు. డిసెంబర్‌ 23న చిత్తూరు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి 145 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో స్పందన లేకపోవడంతోనే ప్రజలు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు.  

⇒ తిరుపతి జిల్లాలో గత నెల 28 వరకు రెవెన్యూ సదస్సుల్లో 13,803 అర్జీలు అందగా అందులో 10 వేలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. 22 ఏ భూ సమస్యలు, పట్టాల మార్పులు, మ్యుటేషన్లు, భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల సమస్యలే అధికం. విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, తాగునీరు, పారిశుద్ద్యం, రేషన్, ఫించన్‌ సమస్యలపై 3,803 అర్జీలు వచ్చాయి. అయితే విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ సమస్యలను మాత్రమే అక్కడిక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. నోడల్‌ ఆఫీసర్లు ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు.  

⇒ కాకినాడ జిల్లా రెవెన్యూ సదస్సుల్లో అర్జీలను స్వీకరించడం, సమస్యలపై చర్చించడం మినహా ఏ ఒక్కటీ పరిష్కరించిన దాఖలాలు లేవు. కొన్నింటిని వీఆర్వోలకు అప్పగించి ఆ సమస్యలు పరిష్కారమైనట్లు చూపుతున్నారు. ఇప్పటి వరకూ 4,635 సమస్యలపై అర్జీలు వచ్చాయని చెబుతున్నారు.  

⇒ విశాఖ జిల్లాలో 4,666 వినతులు రాగా 3,167 అర్జీలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. భూఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టా­దారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదా­య ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. రెవెన్యూ పరంగా వచ్చే దర­ఖాస్తులను జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిస్తున్నారు. 

⇒ అనకాపల్లి జిల్లా రెవెన్యూ సదస్సుల్లో 5,984 వినతులు రాగా 284 అర్జీలను పరిష్కరించారు. భూ ఆక్రమణలు, పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి.  

⇒ అనంతపురం జిల్లా రెవెన్యూ సదస్సుల్లో ఆర్భాటమే కానీ ఫలితం కనిపించడంలేదు. భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వేల సంఖ్యలో అందుతున్నాయి. 5,450 ఫిర్యాదులు అందగా 366 మాత్రమే పరిష్కరించారు.  

⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇప్పటివరకు 9,311 భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. 8,871 సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది.  

⇒ అన్నమయ్య జిల్లా పరిధిలో సదస్సుల ద్వారా 10,421 సమస్యలపై ప్రజలనుంచి వినతులు అందాయి. 924 సమస్యలకు అధికారులు పరిష్కారం చూపారు. 80 శాతం ఫిర్యాదులు  భూ సమస్యలపైనే అందాయి.  

⇒ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 6,908 అర్జీలను స్వీకరించిన అధికారులు కేవలం 513 సమస్యలకు మాత్రమే పరిష్కారాలు చూపారు. అర్జీల పరిష్కారంపై కర్నూలు కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. 21 రోజులైనా ఎందుకు పరిష్కారం కావడం లేదని ఇటీవల సమీక్షలో నిలదీశారు. దేవనకొండ మండలంలో ఒక్క అర్జీకి కూడా పరిష్కారం చూపకపోవడంపై సంబంధిత తహసీల్దార్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.  

పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల సమస్యలే అధికం.. 
రెవెన్యూ సదస్సుల్లో అందుతున్న ఫిర్యా­దుల్లో 60 శాతం పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలకు సంబంధించినవే ఉంటున్నాయి. తప్పులు, ఆన్‌లైన్‌ సమస్యలు, హద్దుల తేడాలు లాంటి సమస్యలే అధికం. భూ­ముల రీ సర్వే మొత్తం తప్పుల తడకని కూటమి నేతలు ప్రచారం చేసినప్పటికీ వాటికి సంబంధించిన వినతులు చాలా తక్కువ సంఖ్యలో రావడం గమనార్హం. అసైన్డ్‌ భూముల సమస్యలు, నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, డీ పట్టాలు, ఇళ్ల పట్టాలకు చెందిన వినతులు ఉంటున్నాయి. అయితే రశీదులు ఇవ్వడమే కానీ పరిష్కారం మాత్రం చూపకపోవడంతో దరఖాస్తుదారులు ఉసూరుమంటున్నారు. 

నెల తరువాత చూద్దాం.. 
గన్నవరానికి చెందిన పొక్కునూరి సోమలింగేశ్వరరావు, ఆయన సోదరుడు తమకు తండ్రి శోభనాచలపతిరావు నుంచి వారసత్వంగా వచ్చిన 3.3 ఎకరాల భూమిని పంచుకుని మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకు వారి పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదు. దీనిపై గన్నవరం రెవెన్యూ సదస్సులో వినతి పత్రం అందచేయగా నెల తర్వాత పరిష్కరించేందుకు ప్రయతి్నస్తామని అధికారులు చెప్పారు.  

Back to Top