నేనున్నాను..

తుపాన్ బాధితుల‌కు అండ‌గా నిలిచిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఇటు ప్రకటన.. అటు సాయం..

పునరావాస కేంద్రాలకు రాకపోయినా తుపాను ఆర్థిక సాయం

ప్రతి కుటుంబానికి రూ.2,500 చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశం 

వేగంగా కొనసాగుతున్న నిత్యావసరాల పంపిణీ

అమరావతి:  తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్‌టీ నెంబర్‌ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
 
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 

2,068 గ్రామాలపై ప్రభావం
మిచాంగ్‌ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. 1,32,569 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 3.71 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. తక్షణ వైద్యం కోసం 355 శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించారు.

మరోవైపు నిత్యావసరాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్‌ వంట నూనె అందించారు. ఇప్పటివరకు 1,02,844 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత 16 మండలాల్లో రెండో రోజు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 వైద్య శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్యసేవలు అందించారు.

జ్వర పీడితులను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పొలాల్లో ముంపు నీటిని తొలగించేందుకు 1,080 మంది ఉపాధి కూలీలను వ్యవసాయ సహాయక చర్యలకు వినియోగించారు. వరద నీటితో యనమదుర్రు డ్రెయిన్‌ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు.

తడిచిన ధాన్యం కొనుగోలు
తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో శుక్రవారం 6,252 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో చాలా వరకు తేమ ఉన్న ధాన్యం కావడం గమనార్హం. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్‌ అజయ్, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా అధికారి సుధా­సాగర్‌లు ధాన్యం కొను­గోలును పర్యవేక్షిస్తున్నారు. మేజర్‌ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేశారు. 

Back to Top