దేశ సగటు కంటే ఏపీ వృద్ధి భేష్‌

సీఎం వైయ‌స్ జగన్‌తో భేటీలో నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ప్రశంసలు

తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అగ్రగామి

దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగ్గా ఉంది

ప్రతి రంగంలో లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు అడుగులు 

ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించిన సీఎం

వ్యవసాయం, వైద్య, విద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వెల్లడి

 అమరావతి: తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశు సంపద తదితర విషయాల్లో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి చాలా బాగుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆయన సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని, ప్రతి రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన బృందం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన.. ప్రధానంగా జీరో బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్, ఆర్గానిక్‌ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచిందని రమేష్‌ చంద్‌ తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా వంట నూనెల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించిందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని, క్షేత్ర స్థాయిలో ఆర్బీకేలు అత్యుత్తమ వ్యవస్థ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దేశం సగటు కన్నా ఆంధ్రప్రదేశ్‌ సగటు అధికంగా ఉందని పేర్కొన్నారు. 

వ్యవసాయ, విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ బృందానికి వివరించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడి పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణ పోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను పెట్టామని, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నామని తెలిపారు. డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమని స్పష్టం చేశారు.

పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్య పరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామని, దీనివల్ల  జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) పెరుగుతోందని చెప్పారు. విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారు చేస్తున్నామని వివరించారు.  ఇంగ్లిష్‌ మీడియం, నాణ్యమైన విద్య దిశగా అడుగులు వేస్తున్నామని, నాడు –నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని, తరగతి గదులను డిజిటల్‌ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామని, దీనివల్ల జీఈఆర్‌ గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు
ప్రభుత్వాస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో నాడు –నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామని సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో, వార్డుల్లో విలేజ్, వార్డు క్లినిక్స్‌ పెడుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీకి రిఫరల్‌ పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, పీహెచ్‌సీలతో.. అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామని, ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్‌ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్‌ పనితీరు.. తదితర అంశాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వారికి వివరించారు. 

ఆర్బీకే చానల్, ఆర్బీకే, అగ్రి ల్యాబ్‌ సందర్శన
 నీతి ఆయోగ్‌ సభ్యుడు (వ్యవసాయం) ప్రొఫెసర్‌ రమేష్‌చంద్‌.. నీతి ఆయోగ్‌ సలహాదారు సి.పార్థసారథిరెడ్డితో కలిసి శుక్రవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించారు. కాల్‌ సెంటర్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే చానల్‌ ద్వారా ప్రసారమవుతున్న వ్యవసాయ ప్రాయోజిత కార్యక్రమాల వీడియోలను తిలకించారు. అనంతరం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట–2 ఆర్బీకేను సందర్శించి, అక్కడ కియోస్క్‌లో ఎరువులు బుక్‌ చేసుకుంటున్న విధానాన్ని, డిజిటల్‌ లైబ్రరీలోని మ్యాగజైన్స్, పంటల వారీగా ఉన్న బుక్‌లెట్స్‌ను, మినీ టెస్టింగ్‌ కిట్‌లు, సాయిల్, మాయిశ్చూర్‌ మిషన్ల ద్వారా చేస్తోన్న పరీక్షలను పరిశీలించారు.

పొలంబడి ప్లాట్‌ను పరిశీలించిన సందర్భంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతులకు జీఏపీ సర్టిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని, భవిష్యత్‌లో సేంద్రియ ధ్రువీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే ఆవరణలో ఉన్న వైఎస్సార్‌ పశు సంచార వైద్య సేవా రథం, రైతు చైతన్య రథాలను పరిశీలించి వాటి ద్వారా అందిస్తోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గండిగుంటలో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఇన్నాళ్లుకు రైతు ముంగిటకు సేవలు వచ్చాయి. మా ఊళ్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్‌ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నారు. పంటలనూ కొనుగోలు చేస్తున్నారు.

నిజంగా వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేం’ అంటూ నందం జోగేశ్వరరావు, గెత్తం విజయ్‌కుమార్‌ అనే రైతులు వివరించారు. ఆ తర్వాత కంకిపాడు అగ్రి ల్యాబ్‌ను సందర్శించి, అక్కడ ఇన్‌పుట్స్‌ను పరీక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ‘రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి’ అని విజిటర్స్‌ బుక్‌లో పేర్కొన్నారు.

 

ఏపీ గ్రోత్‌ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా

NITI Aayog Member Ramesh Chand Praises AP Govt Policies on Agriculture - Sakshi

నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త రమేష్‌ చంద్‌

 వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌ చెప్పారు. రైతు గుమ్మం ముందు సేవలు అందిస్తున్న ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు వ్యవసాయ ముఖ చిత్రాన్ని మారుస్తాయని విశ్వసిస్తున్నానని అన్నారు. సాగులో అనుసరిస్తున్న ఈ విధానాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, ఈ విధానాలు ‘యూనిక్‌’గా ఉన్నాయని అభివర్ణించారు.

రెండున్నర దశాబ్దాలుగా వ్యవసాయ విధానాల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న ఆయన 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. నీతి ఆయోగ్‌లో చేరక ముందు ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌’ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆస్ట్రేలియా, జపాన్‌లో ప్రముఖ యూనివర్సిటీలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా వ్యవసాయ రంగాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. ఏపీలో అమలువుతున్న వ్యవసాయ విధానాలు, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను స్వయంగా చూడటానికి రాష్ట్రానికి వచ్చారు. కంకిపాడు మార్కెట్‌ యార్డ్‌లోని అగ్రి ల్యాబ్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం
►ఏపీలో ఆర్బీకేలు అందిస్తున్న సేవల గురించి విన్నాను. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును స్వయంగా  పరిశీలించడానికి వచ్చాను. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని(ఐటీ) వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో  వినియోగిస్తున్న విధానాన్ని చూశాను. డిజిటల్‌ టెక్నాలజీ వినియోగానికి ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ మంచి ఉదాహరణ. రైతులు సలహాలు, సూచనలు అడుగుతున్న తీరు, అనుమానాలను నివృత్తి చేసుకుంటున్న విధానాన్ని కాల్‌ సెంటర్‌లో పరిశీలించాను. 
►రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)ను సందర్శించాను. సాగుకు సంబంధించిన ‘ఇంటిగ్రేటెడ్‌ సొల్యూషన్‌ ఎట్‌ వన్‌ ప్లేస్‌’గా ఇది రైతులకు తోడ్పాటు అందిస్తోంది. రైతులకు సలహాలు, సూచనలే కాదు.. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను అందించే కేంద్రంగా ఉపయోగపడుతోంది. వ్యవసాయ కేంద్రాలంటే కేవలం పంటలకే పరిమితం కావడం నేను చాలా చోట్ల చూశాను. కానీ ఆర్బీకే అలా లేదు. పశువులు, జీవాలు, ఫిషరీస్‌కు సంబంధించిన కార్యకలాపాలు కలగలిసే ఉన్నాయి. 

నా అభిప్రాయం మార్చుకుంటున్నా..
►వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్‌ టెక్నాలజీ) వినియోగించుకోవడంలో పంజాబ్‌ రాష్ట్రమే దేశంలో ముందుందని అనుకున్నా. ఇక్కడ గ్రామ స్థాయిలో కల్పించిన సౌకర్యాలు, అమలు చేస్తోన్న కార్యక్రమాలు చూసిన తర్వాతæ నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నా. ఇక్కడి వ్యవసాయ వి«ధానాలు, కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఉన్నాయి. 
►ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, అగ్రి ల్యాబ్స్‌ అద్భుతం. మిగతా రాష్ట్రాలకు అనుసరణీయం. వ్యవసాయ రంగం దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే దేశ వ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా. జాతీయ స్థాయిలో అమలు చేయాలని సిఫారసు చేస్తా. 

సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు.. 
►దేశంలో చాలా కాల్‌ సెంటర్స్‌ను చూసాను. కానీ ఇంత పక్కాగా, ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తున్న కాల్‌ సెంటర్‌ ఇదే. శాస్త్రవేత్తలు, అధికారులను రైతులతో అనుసంధానించడం గొప్ప ఆలోచన. శాస్త్రీయ అంశాలను నేరుగా రైతులకు చేర్చడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశమంతా ఈ విధానం అనుసరించాలి.
►కియోస్క్‌లో రైతులు ఎరువులు బుక్‌ చేసుకుంటున్న విధానాన్ని స్వయంగా చూశా. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యద్భుతంగా వినియోగించుకుంటున్నారు. 
►108, 104 అంబులెన్స్‌ తరహాలో మారుమూల పల్లెల్లో పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న అంబులేటరీ సేవలు రైతులకు చాలా ఉపయోగం. 
►వ్యవసాయ రంగంలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్బీకేలు ఉపయోపగపడుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచి రైతులకు అందించడం వల్ల నాణ్యమైన ఇన్‌పుట్స్‌ చౌకగా రైతులకు లభిస్తున్నాయి. 
►వాటి నాణ్యతను పరీక్షించడానికి ల్యాబ్‌లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, నాణ్యత లేని వాటిని తిరస్కరించడం ద్వారా.. నాణ్యత లేని మెటీరియల్‌ ఏదీ రైతులకు చేరదు. ఫలితంగా సాగు చేసి నష్టపోవడమనే సమస్యే తలెత్తదు. 
►ఇక్కడ అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖతో కలిసి సంయుక్తంగా అధ్యయన పత్రం రూపొందించి, నీతి ఆయోగ్‌ ద్వారా ప్రచురిస్తాం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ విధానాల సమాచారం ఇతర రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుంది. 

చాలా సమస్యలకు పరిష్కారం
►రైతు వ్యాపారస్తుడిగా(ట్రేడర్‌గా) మారి తన పంట తాను అమ్ముకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం మంచి పరిణామం. తద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులకు గిట్టుబాట ధర లభించడానికి, మార్కెటింగ్‌లో ఉన్న సమస్యలు అధిగమించడానికి ఈ విధానం దోహదం చేస్తుంది.
►కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడంలో నా పాత్ర ఉంది. రైతు ట్రేడర్‌గా మారాలనేది నా కల. కనీసం చట్టంలో అయినా రైతులు ట్రేడర్లుగా మారాలని నా కోరిక. దురదృష్టవశాత్తు ఆ చట్టాలు వెలుగు చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం సంతోషం. 
►ఏపీ వ్యవసాయ రంగం ‘గ్రోత్‌ స్టోరీ’ దేశానికి స్ఫూర్తినిస్తుంది. కేవలం పంటలే కాకుండా పశుపోషణ, ఆక్వా, ఇతర అనుబంధ రంగాల్లోనూ వృద్ధి రేటు బాగుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 1 శాతం వృద్ధి నమోదైతే, దారిద్య్రం కనీసం 4 శాతం తగ్గుతుంది. వ్యవసాయ ఆధారిత సమాజం మనది. ఈ రంగంలో వృద్ధి అత్యవసరం.

Back to Top