దుర్భిక్ష సీమకు జల రక్ష!

 
నాలుగేళ్లకు ఒక్కసారే కృష్ణమ్మకు వరద 

రాయలసీమ ప్రాజెక్టులు నింపేందుకే కాలువల సామర్థ్యం పెంపు

సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీల ఎత్తిపోతలు అందుకే

శ్రీశైలం స్పిల్‌ వే సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర జలసంఘమే సూచించింది

కాలువల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా స్పిల్‌వేపై వరద ప్రభావాన్ని తగ్గించవచ్చు

సాగర్‌ దిగువ ప్రాంతాలు, విజయవాడకు ముంపు ముప్పూ తప్పుతుంది

ఇవే అంశాలను తెలంగాణ సర్కార్‌కు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతలకూ వివరించండి

అవాస్తవాలతో శత్రుత్వాన్ని రగిల్చే కుయుక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సీఎం వైఎస్‌ జగన్‌కు నవ్యాంధ్రప్రదేశ్‌ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్‌ లేఖ  

తాడేపల్లి: కృష్ణా నదికి నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే వరద జలాలను ఒడిసి పట్టి కరువు పీడిత రాయలసీమలో నీటి కష్టాలను కడతేర్చడం, పంటలకు ప్రాణం పోసేందుకే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువున ఎస్సార్బీసీ కాలువ సామర్థ్యం పెంపు, సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీలను ఎస్సార్బీసీలోకి ఎత్తిపోసే పథకాలను చేపట్టామనే అంశాన్ని తెలంగాణ సర్కారుకు, అక్కడి ప్రతిపక్ష నేతలకు, రిటైర్డ్‌ ఇంజనీర్లకు వివరించాలని నవ్యాంధ్రప్రదేశ్‌ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అవాస్తవాలను వల్లె వేస్తూ తెలుగు రాష్ట్రాల మధ్య శత్రుత్వాన్ని రగిల్చేందుకు కొందరు పన్నుతున్న పన్నాగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.  

సముద్రంలో కలుస్తున్న వరద జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ కరువును కడతేర్చడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలువల సామర్థ్యాన్ని పెంచుతోందని, కృష్ణా జలాల వినియోగంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డుకు కట్టుబడి ఉంటామనే అంశాన్ని తెలంగాణకు స్పష్టం చేయాలని కోరింది. దేశ ఆహార అవసరాలను తీర్చాలనే ధ్యేయంతో తెలంగాణ సర్కార్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల  ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిందని ప్రశంసించింది. రాయలసీమ దాహార్తి తీర్చడానికి, కనీసం నాలుగేళ్లకు ఒక్కసారైనా పంటలకు నీళ్లందించి పేదరికాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలువల సామర్థ్యం పెంపునకు తెలంగాణ సర్కార్‌ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నవ్యాంధ్రప్రదేశ్‌ రిటైర్డు ఇంజనీర్ల అసోషియేషన్‌ అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ..  

వరుసగా కరువు కాటకాలు.. 
► రాయలసీమ భౌగోళిక విస్తీర్ణం 67,710 చదరపు కి.మీ. కాగా 5,125 గ్రామాల్లో 1.64 కోట్ల మంది నివసిస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉండటం, వరుస కరువుల వల్ల సీమ ప్రజలు గుక్కెడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. 

► 1960 నుంచి వరద ప్రవాహాలను పరిశీలిస్తే నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే కృష్ణా నదికి వరద వస్తుంది. విభజన తర్వాత కృష్ణా నదికి రెండు సార్లు వరద వచ్చింది. 

► కృష్ణా నదికి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే వరదను ఒడిసి పట్టి రాయలసీమలో జలాశయాలను నింపడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించడం, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పోతిరెడ్డిపాడు కాలువల విస్తరణ, సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

స్పిల్‌ వే సామర్థ్యం పెంచాలని సీడబ్ల్యూసీ సూచించింది.. 
2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం స్పిల్‌వే ప్లంజ్‌ పూల్‌ దెబ్బతింది. భారీ వరదను తట్టుకునేలా శ్రీశైలం స్పిల్‌ వే సామర్థ్యాన్ని పెంచాలని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) బృందం సూచించింది. ఈ నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల శ్రీశైలం స్పిల్‌వేపై వరద ఉధృతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా నాగార్జునసాగర్‌ దిగువన కృష్ణా పరీవాహక ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రామాలు, విజయవాడ నగరాన్ని  వరద ముప్పు నుంచి రక్షించడానికి దోహదపడుతుంది.  

వరద వినియోగం కోసం తెలంగాణలో పలు ప్రాజెక్టులు 
► బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలను కేటాయించింది. తెలంగాణలో మిగులు జలాల ఆధారంగా చేపట్టిన కల్వకుర్తి (25 టీఎంసీలు), నెట్టెంపాడు (22 టీఎంసీలు), ఎస్సెల్బీసీ (30 టీఎంసీలు)లపై ట్రిబ్యునల్‌ సానుకూలంగా స్పందించలేదు.  

► అయినా సరే విభజన తర్వాత మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం కోసం తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (90 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (30 టీఎంసీలు), మిషన్‌ భగీరథ (19.59 టీఎంసీలు), పాలేరు రిజర్వాయర్‌ నుంచి భక్తరామదాస ఎత్తిపోతల (5.50 టీఎంసీలు), సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల (5.44 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపు (15 టీఎంసీలు), ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు (పది టీఎంసీలు), నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంపు (3.40 టీఎంసీల) చేపట్టడం ద్వారా అదనంగా 178.93 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోవడానికి పనులు చేపట్టింది. అంటే.. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా వరద జలాలను వినియోగించుకోవడానికి తెలంగాణ సర్కార్‌ పలు ప్రాజెక్టులు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.   

పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నారు.. 
► బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తెలుగుగంగ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మిగులు జలాల ఆధారంగా చేపట్టిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టుల పట్ల ట్రిబ్యునల్‌ సానుకూలంగా స్పందించలేదు. మిగుల జలాలను తరలించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కార్‌ పలు ప్రాజెక్టులు చేపట్టిన తరహాలోనే ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ నీటి కష్టాలను కడతేర్చడం, పంటలకు ప్రాణం పోసి పేదరికాన్ని నిర్మూలించడానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాలువల విస్తరణ పనులను చేపట్టింది. నికర జలాల కేటాయింపు ఉన్న ఎస్సార్బీసీ (19 టీఎంసీలు), తెలుగుగంగ (25 టీఎంసీలు) ఆయకట్టుకు సక్రమంగా నీటిని సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుంది. 

► ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015 జూన్‌ 19న కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఐదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. ట్రిబ్యునల్‌ అవార్డుకు కట్టుబడి పరస్పర సహకారం, స్నేహపూర్వక వాతావరణంలో కృష్ణా జలాలను వినియోగించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.  
 

తాజా ఫోటోలు

Back to Top