చంద్రబాబును ప్రధాని పలకరిస్తే.. టీడీపీకే ‘పండగ’

వైయ‌స్ఆర్‌సీపీకి దిగుల్లేదు

అమ‌రావ‌తి: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండుతున్న సందర్భంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌  సమావేశానికి తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర సర్కారు నుంచి ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం మిగిలిన రాజకీయ ప్రముఖులకు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎంగా, ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం తెలుగుదేశం నేతగా ఆయనకు ఎన్నో ఏళ్లకు దేశ ప్రధాని నుంచి ఢిల్లీ రమ్మని పిలుపొచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హస్తినలో చంద్రబాబుతో కాస్సేపు ముచ్చటించడం టీడీపీ అనుకూల మీడియాకు పెద్ద వార్తయి కూర్చుంది. ‘మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి,’ అని ప్రధాని అన్నారని చంద్రబాబు చెప్పిన మాటలు ఆయన అనుకూల పత్రికలు, టీవీ చానళ్లకు గొప్ప సానుకూల పరిణామం. నరేంద్ర మోదీ జీ అన్నారన్న నాలుగు మాటలు చంద్రబాబుకు గాలిమేడలు నిర్మించడానికి అక్కరకొచ్చాయి. బాబు విధేయ మీడియా అంతటితో ఆగితే సరిపోయేది. కాని, మోదీ–బాబు భేటీని చూసి ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దిగులుపడుతోందనట్టు అప్పుడే కథనాలు వండి వార్చుతోంది. 
పాత మిత్రపక్షం నేతను ప్రధాని పలకరిస్తే ఎవరికైనా ఆందోళన ఎందుకు?
కేంద్రంలో గత 8 సంవత్సరాలుగా పాలకపక్షమైన బీజేపీకి తెలుగుదేశం పాత మిత్రపక్షం. ఈ ఎనిమిదేళ్లలో నాలుగేళ్లు కలిసి నడిచాయి ఈ రెండు పార్టీలు. మోదీ మొదటి సర్కారుకు మాజీ భాగస్వామ్య పార్టీ అనే హోదా కూడా టీడీపీకి ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిన సత్యమే. 1999 ఏప్రిల్‌ నెలలో జరిగిన బలపరీక్షలో బీజేపీ తొలి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి నేతృత్వంలోని బీజేపీ–ఎన్డీఏ సంకీర్ణ సర్కారు ఒక్క ఓటుతో కూలిపోయినప్పటి నుంచి 2004 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షమే. మళ్లీ 2014 లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి 2018 వరకూ కూడా బీజేపీకి చంద్రబాబు పార్టీ మిత్రపక్షమే. మళ్లీ బీజేపీతో దోస్తీ కుదిరితే బాగుండు–అని ఆశపడుతున్నదీ తెలుగుదేశం పార్టీయే. బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్న చరిత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు రాజకీయ నేతలుగా నరేంద్రమోదీ–చంద్రబాబు మధ్య మామూలు సంబంధాలు ఏర్పడితే ఏపీలోని పాలకపక్షానికి ఎలాంటి దిగులు ఉండదు. ఏ రెండు పార్టీలైనా కలవడం లేదా విడిపోవడం వాటి ఇష్టం. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుగా ముద్రపడిన నాయకుడి పార్టీకి ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్నది బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అగ్రనేతతో చంద్రబాబు గారు సమావేశమైతే వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, అనవసరంగా కంగారుపడదని టీడీపీ విధేయ మీడియా గుర్తిస్తే మంచిది.

Back to Top