అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలందరికీ నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదలకు ఇలా సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా కులాల ప్రస్తావన లేకుండా కేవలం ఆర్థిక స్థోమతను పరిగణనలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నారు. 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో 1,62,84,820 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతోపాటు నగదు బదిలీయేతర పథకాల ద్వారా ఏకంగా రూ.16,514.95 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని.. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు కాదని ఆచరణలో అమలు చేసి చూపించిన తొలి సీఎం వైయస్ జగన్. ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక సూత్రం పేదరిక నిర్మూలనే అవుతుంది. అందుకు అనుగుణంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆప్రాతిపదికనే అగ్రవర్ణాల్లోనూ పేదలందరికీ సీఎం వైయస్ జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. గత సర్కారు హయాంలో పెన్షన్, రేషన్ కార్డు కావాలంటే తొలుత ఏ పార్టీ అని ఆరా తీసేవారు. ఆ తరువాత ఏ కులం? అని ప్రశ్నించేవారు. తమ పార్టీ వారికి లేదంటే తమ కులం వారికే మంజూరు చేసేవారు. అది కూడా లంచం ఇస్తేనే తప్ప కనికరించేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.