అలుపెరుగని పోరాట యోధుడు అనుకున్నది సాధించాడు. ఇక ప్రజలకు చెప్పింది చేయడం కోసం అనుక్షణం పరితపిస్తాడు. ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న వైయస్ జగన్ వ్యక్తిత్వం విలక్షణం. ప్రజాసంక్షేమం విషయంలో రాజీలేని ధోరణితో ముందుకు సాగడం యధార్థం. ఆంధ్రప్రదేశ్‌లో మార్పు తథ్యం. నిన్నామొన్నటిదాకా సాగిన పాలనకు పూర్తి భిన్నంగా, ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు చూడబోతున్నారు. మే 23, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డులకెక్కిన రోజు. కనివినీ ఎరుగని రీతిలో వైఎస్సార్‌సీపీ పార్టీకి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు. విజయసారధి వైయస్ జగనే. దాదాపు పదేళ్ల రాజకీయజీవితంలో జగన్...ప్రజల మనిషై పోయాడు. జగన్ అంటే జనం, జనమంటే జగన్ అనే తీరులో ఎదిగిపోయాడు. కేవలం ఒక్కశాతం ఓట్లతేడాతో 2014లో అధికారానికి దూరమయినా, 2019లో పదిశాతం ఓట్ల ఆధిక్యతతో తన పార్టీని గెలుపుతీరాలకు చేర్చాడు జగన్. ప్రత్యర్ధులు పెరిగే కొద్దీ, కుట్రలు, కుతంత్రాలు పెరిగే కొద్దీ, సవాళ్లు ఎదురయ్యే కొద్దీ....కుదించుకుపోవాల్సిన జగన్ ఎదిగిపోతూ కనిపించాడు. ప్రజాక్షేత్రంలో నిలిచాడు. నడిచాడు. గెలిచాడు. ఇప్పుడు వై.యస్‌జగన్... ఐదుకోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షల ప్రతినిధి. ప్రజలు నమ్మినవాడు. విలువలు, విశ్వసనీయతలే ఆయుధాలుగా ముందుకు సాగుతున్నవాడు. అనుకున్నది సాధించడంలో జగన్ మొండిపట్టుదల ప్రత్యర్ధులకిప్పుడు బాగానే అర్థమయ్యే వుంటుంది. దిమ్మతిరిగిపోయేంత దెబ్బకొట్టాడుగా మరి. ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు సిసలు ప్రజానాయకుడిగా జగన్ తన ఉనికిని చాటడంలో అతని వ్యక్తిత్వమే అతనికి బలమైంది. తన గోల్ ప్రజలకు మంచి చేయాలని, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలని. మంచిలక్ష్యం. ఆ లక్ష్యసాధనలో సడలని ప్రయత్నం, పోరాటం. నలభై ఆరో ఏటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న జగన్ ముందు సవాలక్ష సమస్యల ఆంధ్రప్రదేశ్ వుంది. జగన్ వస్తే...ఏమీ చేయని స్థాయిలో వుండాలన్న కక్ష కొద్దీ రాష్ట్రాన్ని పాలించినట్టున్నారు బాబుగారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అందరూ ఆదుర్దా పడుతున్న వేళ జగన్ పాలన మొదలుపెట్టబోతున్నారు. అయినా, వైయస్ వారసుడు చక్కగా పరిపాలిస్తాడని, అనుకున్నవన్నీ చేస్తాడని కోట్లమంది నమ్మకం. తనూ చేసి తీరుతానంటున్నాడు. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 86శాతం సీట్లను గెలిచిన తీరే జగన్‌పై ప్రజల నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. బాగా చదువుకున్నాడు. విషయాలపట్ల అవగాహన వున్నవాడు. అన్నింటి గురించి స్పష్టంగా తెలుసుకుని కార్యాచరణకు దిగేవాడు. వైయస్ జగన్ తన ఢిల్లీ పర్యటనతో.. అటు జాతీయనాయకులకు, మరీ ముఖ్యంగా అధికార బీజేపీ నేతలకు తనేంటో బాగానే పరిచయం చేసుకున్నారు. లోపల గత పాలకుడికి, తనకు తేడా ఏంటో కూడా అర్థమయ్యేలానే మాట్లాడివుంటారు. యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాసేవ చేయాలని వచ్చినవాడు అని అర్థమయ్యేవుంటాడు. ఇంతకాలం స్వీయప్రయోజనాలు, రాజకీయప్రయోజనాలతో సాగిన బాబు పాలనకు భిన్నంగా, ప్రజాప్రయోజనాలు, రాష్ట్రప్రయోజనాలే ముఖ్యంగా... వైయస్ జగన్ పాలన సాగబోతోందని....వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన స్పష్టం చేసింది. జగన్ పట్టుదల రాష్ట్రానికే మేలు చేసే అవకాశం పుష్కలంగా వుందన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా. రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న తెస్తాడని ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడిపోయిన సందర్భమిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైయస్ రాజశేఖరరెడ్డిది ఒక ప్రత్యేకస్థానం. తెలుగురాజకీయాన్నే మార్చిన ఘనత వైయస్‌ది. తను అనుసరించిన సంక్షేమపథం, అభివృద్ధి బాటలతో వైయస్ కోట్లాదిజనం గుండెల్లో మరపురాని రాజన్నగా కొలువుదీరిపోయారు. రాజకీయం అంటే ప్రత్యర్ధిని దెబ్బతీయడం కాదు, ప్రజలతో మమేకం కావడం, ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోవడమనే వైయస్సార్ రాజకీయసూత్రం గురించి జగన్‌కు తెలుసు. అతని పంధా కూడా అదే. తను కోరుకున్నట్టుగానే దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు మెండుగా అందినవేళ...ప్రతిపక్షనేతగా ఎంతో పరిణతి చూపిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రిగా మరింతగా ఆకట్టుకోవడం మాత్రం ఖాయం.