రెడ్‌బుక్‌ కుట్రతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

రెడ్‌బుక్‌ కుట్రతో.. గాడి తప్పిన పోలీసింగ్ 

9 నెలలుగా వెయిటింగ్‌లోనే 59 మంది అదనపు ఎస్పీలు, డీఎస్పీలు

‘వీఆర్‌’లో 90 మంది సీఐలు, 120 మంది ఎస్సైలు 

తగ్గిపోయిన సమర్థులైన అధికారుల సంఖ్య 

దిగజారుతున్న శాంతిభద్రతలు.. పెరిగిన సైబర్‌ నేరాలు  

అయినా బాధ్యతగా వ్యవహరించని ప్రభుత్వం

⇒ విజయవాడ వరదల్లో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది 
పోలీసుఅధికారులనువినియోగించని ప్రభుత్వం 
ఫలితం.. దాదాపు 50మంది దుర్మరణం 
⇒ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం.. 
ఫలితం.. తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల మృతి 
⇒ సైబర్‌ నేరస్తులు చెలరేగిపోతున్నా సైబర్‌ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయని ప్రభుత్వం 
ఫలితం.. గత ఏడాదిలో ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ ముఠాలు 
⇒ ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతులేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. 

ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలకు అంతన్నదే లేదు. రాష్ట్రంలో పోలీసింగ్‌ అన్నదే కనిపించకుండా పోయింది. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో సమర్ధులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం.. ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం. ఇది నిఖార్సైన నిజం. 

ఎందుకంటే.. అధికారులపై రెడ్‌బుక్‌ కక్ష. సీనియర్‌ ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్‌బుక్‌ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్‌లో, వేకెన్సీ రిజర్వ్‌లోనో లేదంటే సస్పెన్షన్‌లోనే పెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, మహిళలపై అత్యాచారలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా, సామాన్యుల కష్టార్జితం సైబర్‌ ముఠాల పాలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, అధికారులందరినీ పక్కన పెట్టేసింది. 

‘వెయిటింగ్‌’లో పెట్టు...‘వీఆర్‌’లో ఉంచూ 
వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్‌ (వీఆర్‌).. ఈ రెండు పదాల మధ్యే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక మంది పోలీసు అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను  వెయిటింగ్‌లో ఉంచి, మరో నలుగురు ఐపీఎస్‌ అధికారులను కక్ష పూరితంగా సస్పెండ్‌ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం అంతటితో ఆగ లేదు. నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్‌లోనే ఉంచింది. 

పరిపాలన పరమైన అంశాలతో నలుగురైదురుగురికి స్వల్ప కాలం వెయిటింగ్‌లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సది్వనియోగం చేసుకోవడం రివాజు. కానీ ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసి, వారందరినీ పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. వారిలో నలుగురు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, ఒక ఏఆర్‌ డీఎస్పీ ఉన్నారు. 
 

– ఇక శాంతి–భద్రతల పరిరక్షణ, ఇతర పోలీసు విధుల్లో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారులపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దురీ్నతి ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు రేంజ్‌లో 28 మంది, కర్నూలు రేంజ్‌లో 21 మంది, ఏలూరు రేంజ్‌లో 24 మంది, విశాఖపట్నం రేంజ్‌లో 17 మంది సీఐలను ‘వీఆర్‌’లో పెట్టింది. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్సైలను ‘వీఆర్‌’లో ఉంచింది. దీంతో పని చేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. 

అమాంతంగా పెరిగిన నేరాలు– ఘోరాలు 
అధికారులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అందుబాటులో ఉన్న  పోలీసు అధికారులను వెయిటింగ్‌లో, వీఆర్‌లో పెట్టడంతో పోలీసు వ్యవస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతోంది. దాంతో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2024లో సైబర్‌ నేరాలపై ఏకంగా 7.23లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. 

దాంతో సైబర్‌ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులకు నియోగించలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది.   

Back to Top