టీడీపీ ప్రభుత్వం బలహీనపడుతోంది..!

అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది..!
టీడీపీపై కమలనాథుల గరంగరం..!

వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు..తన మిత్రపక్షానికి పోటు పెట్టాడు. ఎన్నికల్లో కమలనాథులతో కలిసి పోటీ చేసిన బాబు..ఆతర్వాత వారిని రాష్ట్రంలో అణగదొక్కేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీన్ని ఆలస్యంగా మేల్కొన్న ఏపీ కమలనాథులు చంద్రబాబుపై ఎదురుదాడి ప్రారంభించారు. టీడీపీ పనితనంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. పచ్చనేతల దందాలు, దోపిడీలు శృతిమించాయని నిప్పులు చెరుగుతున్నారు.  చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. 

చంద్రబాబు హైడ్రామా..!
కేంద్రం నుంచి వస్తున్న నిధుల విషయంలో చంద్రబాబు ఎక్కడా ప్రచారం చేయకపోవడం. రాజధాని నిర్మాణానికి దాదాపు 18 వందల కోట్ల రూపాయిలు కేంద్రం విడుదల చేసినా ఆ విషయం బయటకు చెప్పకపోవడం.  పెట్రో, ట్రైబల్, సెంట్రల్ యూనివర్శిటీల ఏర్పాటుకి కేంద్రం అనుమతులు ఇచ్చినా... వాటికి భూములు ఇవ్వకుండా చంద్రబాబు నాటకాలు కొనసాగించడం లాంటి చర్యలతో కమలదళం ఆగ్రహంతో ఉంది. కేంద్రానికి  పేరు వచ్చేస్తుందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు హైడ్రామా కొనసాగిస్తుండడంతో ఫైరవుతోంది. 

నిధులపై నోరుమెదపని బాబు..!
ఉన్నత విద్య కోసం కేంద్రం రూ. 4 వేల కోట్లు ఇచ్చింది. మరో 4 వేల కోట్ల విడుదలకు రంగం సిద్దంమైంది. అయినా సరే,  నిధుల్ని ఎక్కడ వెచ్చించింది లెక్కలు చెప్పకుండా దొంగాట ఆడుతోంది. ఒంగోలు, చిత్తూరు, తిరుపతి లలో నిమ్స్ ఏర్పాటుకి కేంద్రం అనుకూలంగా ఉన్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టడం లేదు.  ఒక వైపు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని దిగమింగుతూనే , మరో వైపు బీజేపీకి ఏమాత్రం మంచి పేరు రాకుండా అడ్డు పడుతోందని విమర్శలకు పదునుపెట్టారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని దాచిపెట్టేసి, నింద అంతా కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టివేసేందుకు కుట్రలు జరుగుతున్న తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. 

అందలమెక్కిన అవినీతి..!
ఈక్రమంలోనే ఏపీ కమలదళం మిత్రపక్షంపై తిరుగుబావుటా ఎగరవేస్తోంది. ఏపీలో చంద్రబాబు సర్కార్ బలహీనపడుతోందని బీజేపీ  నేత కావూరి సాంబశివరావు అన్నారు. లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. పచ్చనేతల అవినీతి పెరిగి విలువలు పడిపోయాయని ఎత్తిపొడిచారు. వంగవీటి మోహనరంగా హత్య కేసులో వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ చురక అంటించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ప్రజలకు చేరువకాకుండా వాడుకుంటూ ...చంద్రబాబు కేంద్ర పథకాలను నీరుగారుస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈపరిణామాలన్నంటిని చూస్తే మిత్రపక్షంతో తెగదెంపులు చేసుకునేలా బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
Back to Top