ప్రైవేటు గుప్పిట్లోకి ప్రభుత్వాసుపత్రులు..!

పేదలపై చంద్రప్రతాపం..!
రోగమొస్తే అంతే సంగతులు...!
ఇక నుంచి పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మిగలనుంది. అరకొర వసతులతోనైనా అంతో ఇంతో నిరుపేదలకు వైద్యం అందించే సర్కారీ దవాఖానాలు ఇకనుంచి  ఖరీదు కానున్నాయి. రోగమొస్తే ప్రభుత్వ దవాఖానాకు పోయే రోజులకు ప్రభుత్వం చెల్లుచీటి పాడుతోంది. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ గుప్పిట్లో పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాసుపత్రుల్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమైంది.  ఇప్పటికే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలోకు మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం మరో 8 జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు హాస్పిటల్స్ కు కట్టబెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు ఎంటర్ ప్రెన్యూర్ లను ప్రోత్సహించాలి, కొత్త మెడికల్ కళాశాలు రావాలి అన్న సాకుతో క్రమంగా బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నానికి బీజం చుడుతోంది.

చంద్రబాబు రూటే ...కార్పొరేటు..!
ప్రభుత్వాసుపత్రుల్ని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఏర్పాటు చేస్తాం. పేదప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం. ఆస్పత్రి అభివృద్ధికోసం వేల కోట్లు వెచ్చిస్తున్నామంటూ చెప్పే పాలకులు..ఇప్పుడు ఉన్న ఆస్పత్రులను కూడా సంపన్నుల చేతిలో పెట్టేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వారం క్రితం  విజయవాడలో జరిగిన సమీక్షలో సీఎం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. వైద్యసేవల్ని ఊడగొట్టేస్తూ పేదరోగులను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. అంతటితో ఆగని సర్కార్.. కార్పొరేట్ తరహాలో ముక్కుపిండి వసూలు చేసేలా యూజర్ ఛార్జీలకు తెరదీస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే వైద్యాన్ని వ్యాపారం చేస్తూ నడిరోడ్డున పడేస్తుంటే  తమ ప్రాణాలకు దిక్కెవరని ఆపేదబతుకులు కన్నీరుపెడుతున్నాయి.  
  
పేదలపై చంద్రప్రతాపం..!
అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల బాధ్యతను ప్రైవేటు హాస్పిటల్స్ తీసుకుంటాయా ...? జరగరాని నష్టం జరిగితే భరించేదెవరు...? కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితేంటి..? మౌళిక వసతుల కల్పన ఏమేరకు చేస్తారన్నది గాలిలో దీపంలా మారింది. ఇక ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, పారామెడికల్, నర్సులది దీనస్థితి.  ప్రైవేటు హాస్పిటల్స్ కింద పనిచేయాలంటేనే జంకుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. 

తాజా వీడియోలు

Back to Top