ప్రజల బాధలు వింటూ... ధైర్యం చెపుతూ...

మంత్రాలయం:

ప్రజలు చెప్పింది ఓపికగా విన్నారు. కష్టాలను అర్థం చేసుకున్నారు. ధైర్యం చెప్పారు. జగనన్న సీఎం కాగానే మంచిరోజులొస్తాయని షర్మిల భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరు మండలంలో శుక్రవారం  మరో ప్రజాప్రస్థానం సాగిన తీరిది. హెచ్. మొరవణి నుంచి శుక్రవారం ఉదయం మొదలైన షర్మిల పాదయాత్ర నాలుగో మైలురాయి క్రాస్, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ రోడ్డు, శ్రీనివాస సర్కిల్, ట్యాంక్‌బండ్ రోడ్డు, సోమప్ప సర్కిల్‌గుండా గణేశ్ రైస్ మిల్లు వరకు సాగింది. హెచ్. మొరవణి వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండలో మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో ‘అన్నా, తమ్ముడూ వెనక్కి వెళ్లండి. ఆడవాళ్లను ముందుకు పంపండి’ అని కోరుతూ సుమారు అరగంట సేపు వారితో మాట్లాడారు. కరెంటు లేకున్నా బిల్లులు దండిగా వస్తున్నాయని, తాగడానికి నీళ్లు కూడా లేవని, ఇందిరమ్మ ఇళ్లు లేక, కట్టుకున్న ఇళ్లకు బిల్లులు రాక బాధలు పడుతున్నామని , ముసలోళ్లకు కూడా పింఛన్లు ఇవ్వడం లేదని మహిళలు షర్మిల ముందు వాపోయారు.

ప్రభుత్వానికి పేదలంటే కోపం

     వారితో షర్మిల మాట్లాడుతూ ‘ ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి పేదలంటే కోపమనీ, వై.యస్ కుటుంబం మీది కోపంతో ప్రజలందరినీ హింసిస్తోందనీ  ధ్వజమెత్తారు. ‘ ఇంకా ఓ సంవత్సరం ఎలాగోలా కష్టపడండమ్మా... తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు అన్ని కష్టాలు తీరుతాయి. పింఛన్లు వస్తాయి. పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పించుకోవచ్చు. రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్తు అందుతుంది. వడ్డీ లేకుండానే రుణాలు వస్తాయి. దేవుడు కూడా కరుణించి వానలు కురిపిస్తాడు’ అని ధైర్యం చెప్పారు. కంబళహాల్ క్రాస్, జగ్గాపురం క్రాస్, కొత్త గొళ్లాల దొడ్డి గ్రామాల్లో కూడా తనను కలవడానికి వచ్చిన మహిళలు, రైతులు, కూలీలతో మాట్లాడుతూ ధైర్యం చెప్పి ముందుకు సాగారు.

     షర్మిల పాదయాత్రలో శుక్రవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల)తో పాటు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, జిల్లా ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, వై. బాల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, గండి బాబ్జీ, సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇతర నాయకులు కర్రా హ ర్షవర్ధన్ రెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి, డాక్టర్ ఎ. మధుసూదన్, తెర్నెకల్లు సురేందర్ రెడ్డి, వెంకట రామిరెడ్డి, ఆర్. రాకేష్ రెడ్డి, రమాదేవి, ఎం.ఎల్. కాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top