నారా వైఫల్య నామ సంవత్సరం2018 సంవత్సరం పూర్తి కావస్తోంది. 
హామీలు హుళక్కి
2018కల్లా పూర్తి చేసేస్తానని చంద్రబాబు బీరాలు పలికిన ఒక్క హామీ కూడా ఎక్కడా నెరవేరలేదు. నాలుగున్నరేళ్లుగా బాబు ఇచ్చినవ హామీల్లో కనీసం 20శాతం కూడా నెరవేరలేదంటే పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచీ బాబు పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా దీక్షలు, కడప స్టీలుప్లాంటు విషయంలో కేంద్రం నుంచి అనుమతులు, రైల్వేజోన్ వంటి అతి ముఖ్యమైన విషయాల్లోనూ బాబు ఎక్కడా సఫలం కాలేక పోయాడు. విదేశీ ప్రయాణాలు కూడా ఎప్పటిలానే రూపాయి నిధులు తేలేదు. 
ముందుకు పడని అడుగులు
ఇప్పటికే పునాదులు, శిలాఫలకాలు పడ్డ ఏ ప్రాజెక్టులూ పూర్తిస్థాయిలో పట్టా లెక్కలేదు. స్మార్ట్ సిటీల సంగతి ఏమైందో ఎవరికీ తెలియదు. నీళ్లున్న చోటల్లా ఓడరేవు, జిల్లాకో ఎయిర్ పోర్టు విషయాల్లోనూ ఎలాంటి ప్రగతీ లేదు. కనీస మౌలిక వసతుల కల్పన కూడా లేదు. ప్రతి జిల్లాలోనూ ఉపాధి అవకాశాలు పెంచే పరిశ్రమల స్థాపన మాటలు కూడా చేతల్లోకి రాలేదు. కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, శ్రీకాకుళంలో టెక్స్ టైల్ పార్కు, కృష్ణాజిల్లాలో ఫుడ్ పార్కు, కర్నూలు లో మెగా సీడ్ పార్కు ఇలా పేర్లు గొప్పగా చెప్పినా ఎక్కడా వీటి ఆనవాళ్లు లేవు. ఇక ఈ ఏడాది కొలువుల సంగతైతే అంతా గందరగోళమే. మూడేళ్లుగా ఊరించి ఈ ఏడాది చివర్లో ముష్టిలా వేసిన 12000 పోస్టుల డీఎస్సీ బోలెడన్ని లిటిగేషన్లతో ఉంది. రేపు ఈ వ్యవహారం కోర్టులో మూలకు చేరేది తప్ప ఉద్యోగాలిచ్చేదైతే కాదు. రాజధాని నిర్మాణాల విషయంలోనూ ఇదే జాప్యం. మరో రెండు సార్లు డిజైన్ల తనిఖీలు, రేపో మాపో నిర్మాణాలు ప్రారంభం అని కబుర్లు తప్ప క్షేత్ర స్థాయిలో పనులు జరగడం లేదు. సుప్రీం మొట్టికాయలతో తప్పనిసరిగా జనవరిలో హైకోర్టును తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ, వ్యాపార రంగాలన్నీ కుదేలయ్యాయి. ఎక్కడా అభివృద్ధి జాడ కనిపించడం లేదు. వరస తుఫాన్లు, కొన్ని చోట్ల కరువులు. కేంద్రం వీటికోసం ఇచ్చిన నిధులు దారిమళ్లిపోయాయి. 
సర్కార్ పై పెరిగిన వ్యతిరేకత
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డాడు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగాడు. కానీ బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో వ్యతిరేకతే ఎదురౌతోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచుతున్నాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోకపోవడంపై అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, దుర్ఘటనల సమయంలో సర్కారు తీరు, చంద్రబాబు ప్రచారార్భాటం ప్రజల్లో జుగుప్సుకు కారణం అయ్యాయి. రిషితీశ్వరి మరణం, పుష్కరాల దుర్ఘటన, వనజాక్షిపై దాడి, చింతమనేని దాష్టీకాలు, రాజధాని భూములు ఇలా ఏ వ్యవహారంలోనూ బాబు ఆదేశించిన కమిటీలు వాస్తవాలను నిర్థారించలేదు. ఏళ్ల తరబడి సాగిన దర్యాప్తులు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన నివేదికలను చూసి ప్రజలు కమిటీలను చంద్రబాబు జేబు సంస్థలనే భావిస్తున్నారు. రుణమాఫీ, నిరుద్యోగభృతి, ఉద్యోగ కల్పన, నేరాలు పెరిగిపోవడం ఇలా ప్రతి అంశంలోనూ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. చంద్రబాబు అంటేనే రగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వీటిని కప్పిపుచ్చేందుకు బాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను కనీసం చిత్తుకాగితాలుగా కూడా ప్రజలు భావించడం లేదు. 
పడకేసిన పాలన
రాష్ట్రంలో పాలన పడకేసింది. చంద్రబాబు విదేశీ టూర్లతో పాటు, ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టాడు. పక్కరాష్ట్ర ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. పరిపాలన కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతిపక్షాన్ని తిట్టడంలనూ, కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంలోనూ కాలం గడిపేసాడు. బాబు కాన్ఫరెన్సుల తో అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. పింఛన్ల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలవరకూ అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం అయిపోయాయి. 
ఏడాది చివర చెంపదెబ్బలు
అగ్రిగోల్డు వ్యవహారం, హైకోర్టు ఏర్పాటు, జగన్ పై దాడులు, బీజేపీతో తగువులు, అవిశ్వాసంలో బొప్పికట్టిన తల, టీడీపీ నేతలపై సిబిఐ, ఐటీ దాడులు, రెండుకళ్లు రెండు నాల్కల సిద్ధాంతపు బాబుకు తెలంగాణా ఎన్నికల్లో జరిగిన పరాభవం ఇవన్నీ 2018 చంద్రబాబుకు ఇచ్చిన చెంపదెబ్బలనే అనుకోవాలి. 
పరాజయాలకు పరాకాష్టగా నిలిచిన 2018 చంద్రబాబు అధికార దుర్వినియోగానికి, ఆశ్రిత పక్షపాతానికి, టెంపరితనానికి సాక్ష్యంగా నిలిచింది. అసమర్థ పాలనకు ఆఖరి ఏడాదిగా ప్రజలు భావిస్తున్న ఈ సంవత్సరం బాబు అక్రమాల పాలనకు అంతం అని ప్రజలు చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. 
 

తాజా వీడియోలు

Back to Top