కుయ్యో మొయ్యో ప్రచారం..!


ఉట్టికి ఎగరలేనిబాబు ఆకాశానికి ఎగురుతానన్నట్టుగా ఉంది ఎపి సర్కారు తీరు. ఆపదలో మనుషుల ప్రాణాలు రక్షించే అంబులెన్సులు మూలనపడి మూలుగుతున్నాయి... ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అని నెత్తి నోరూ మొత్తుకున్నా వినిపించుకోరు. కానీ.. వృక్ష రక్షక్ వాహనాలు పెట్టి చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడతానంటూ ముందుకొచ్చారు. ఇదెంత విడ్డూరం. ఒకప్పుడు 108 కి ఫోన్ చేస్తే కుయ్ కుయ్ కుయ్ మంటూ 20 నిమిషాలలోపు వచ్చి వాలిపోయే ప్రాణదాతలు ఇప్పుడు ప్రాణం పోతుందన్నా జాడలేవు. ఏ జిల్లాలో ఏ సెంటర్ కి బాధితులు ఫోన్ చేసినా ఏదో ఒక సమస్య చెబుతున్నారు. డ్రైవర్ లేకపోవచ్చు, డీజిల్ లేకపోవచ్చు, ఇంజిన్ పనిచేయకపోవచ్చు, బ్రేకులు ఫెయిలై ఉండొచ్చు, అత్యవసర వైద్యానికి అవసరమయ్యే మందులు లేకపోవచ్చు, అన్నీ ఉన్నా వైద్య సిబ్బంది లేకపోవచ్చు... ఇలా సవాలక్ష కారణాలతో మొత్తానికి 108 ఇప్పుడు కదలడంలేదు. ఉద్యోగులు మొరపెట్టుకున్నా, ప్రజల తరపున ప్రభుత్వం నిలదీసినా, 108 సమయానికి లేక ప్రాణం పోయిందనే వార్తలు రోజూ పత్రికల్లో, టివీల్లో వినిపిస్తున్నా సరే పట్టించుకునే దిక్కులేదు. మాట్లాడితే తానే అన్నీ కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఈ ఒక్క పథకానికి మరమ్మత్తులు చేయలేకపోయారంటే, ప్రజల పట్ల... వారి ప్రాణాలపట్ల ఆయనకు ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం అవుతోంది. ఇలాంటి ఆలోచన ఉన్న మనిషి కాబట్టే... గోదావరి పుష్కరాల్లో ఈయన షూటింగ్ వల్ల పోయిన ప్రాణాలకు మూఢభక్తి, అత్యుత్సాహమే కారణమని తేల్చేయగలిగారు. చేసిందంతా చేసి ఇప్పుడేమో చెట్లకోసం అంబులెన్సులు పెట్టి పర్యావరణాన్ని కాపాడతానని కొత్త డప్పు వాయిస్తున్నారు. ప్రభుత్వంగా ప్రజలకు చేయాల్సింది చేయకపోగా, ఏదో ఒకటి చేస్తుందనే భ్రమను కల్గించడానికే బాబు నాలుగున్నరేళ్లుగా శ్రమిస్తున్నాడు. ప్రజలు అంతా గమనిస్తున్నారు.

 
Back to Top