జయజయధ్వానాలూ.. జగన్నినాదాలు

ఆదిలాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు నిర్మల్ పట్టణంలో అపూర్వ స్వాగతం లభించింది. ఆమె హాజరైన  సభా ప్రాంగణం జనంతో సముద్రాన్ని తలపించింది. మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన అనుచరులు హాజరైన సభ నేపథ్యంలో నిర్మల్ పట్టణం ప్రజలనే తోరణాలతో అలంకరించినట్లు కనిపించింది. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
 
ఇసుకేస్తే రాలనంత జనం

     నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉదయం నుంచే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో వచ్చారు. ఎన్‌టీఆర్ స్టేడియం ఆవరణ పూర్తిగా జనంతో కిక్కిరిసింది. ఎటు చూసినా ప్రజలతో కిటకిటలాడుతూ కనిపించింది. జిల్లాలోని ఆయా గ్రామాలతోపాటు పట్టణంలోని వివిధ వార్డుల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలుగా సభాస్థలికి తరలివచ్చారు. గుస్సాడి నృత్యాలతో వచ్చిన గోండు, గిరిజనులు శ్రీమతి విజయమ్మకు ఘనంగా స్వాగతం పలికారు. బహిరంగ సభస్థలి వద్ద  కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు పాడిన పాటలు, చేసిన నృత్యాలు ప్రాంగణంలోని వారిలో ఉత్తేజం   నింపాయి. ఆద్యంతం ప్రాంగణంతోపాటు పట్టణం అలరించింది. ఇదిలా వుండగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మకు జనం ఘనస్వాగతం పలికారు. జిల్లా ముఖద్వారమైన నిర్మల్ మండలంలోని సోన్ గోదావరి బ్రిడ్జిపై మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప, కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్, బోథ్ వ్యవసాయ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్, జిల్లా యువజన సంఘం కొమ్ముల వినాయకరెడ్డిలతోపాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు.

తెలంగాణ అమరులకు విజయమ్మ నివాళి

     శ్రీమతి విజయమ్మ తన ప్రసంగానికి ముందు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారికి నివాళులర్పించారు. రెండు నిమిషాలు సభా వేదికపై నివాళులర్పించిన నేతలు అమరులను స్మరించుకున్నారు. నిర్మల్ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు అరుణ్ మృతికి, రైతు ఆత్మహత్యలపై కూడా సంతాపం ప్రకటించారు. ఇదిలా వుండగా నాయకులు, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రసంగించే సమయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది. జగనన్న జిందాబాద్.. జై జగన్... అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఐకే రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీబీఐ శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై అనుసరిస్తున్న విధానాలపై ప్రసంగించిన సమయంలో అభిమానులు సీబీఐ డౌన్... డౌన్.. అంటూ నినాదాలు చేశారు. వారి ఉత్సాహాన్ని గుర్తించిన పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్, మాజీ ఎంపీ ఐకే రెడ్డిలు జగనన్నను వెంటనే విడుదల చేయాలని.. అనడంతో వారికి అభిమానులు తోడై చేసినా నినాదాలు ప్రాంగణంలో దద్దరిల్లాయి. ఇదిలా వుండగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ మొట్టమొదటిసారిగా జిల్లాకు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జ్ఞాపికలను అందజేసి సన్మానించారు.

తాజా వీడియోలు

Back to Top