క్షణం తీరిక లేకుండా జగన్ బిజీబిజీ

హైదరాబాద్‌ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం నుంచే రోజంతా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అటు పార్టీ కార్యక్రమాలు ఇటు అభిమానులను కలుసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపారు. బెయిల్‌పై మంగళవారం విడుదలైన ఆయన ఆ రోజు రాత్రి 9.30కు తన నివాసానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతూ గడిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీ జగన్‌ను కలిసేందుకు బుధవారం ఉదయం నుంచీ హైదరాబద్‌ వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూనే మరోవైపు పార్టీకి చెందిన వేర్వేరు విభాగాల నాయకులతో రాత్రి పొద్దుపోయే వరకు భేటీలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలపై ఆరా తీయడమే కాకుండా భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు శ్రీ జగన్మోహన్‌రెడ్డితో భేటి అయ్యారు. అరగంట పాటు జరిగిన చర్చల్లో సమైక్య ఉద్యమానికి అండగా ఉంటానని వారికి శ్రీ జగన్ హామీ ఇచ్చారు. ‌ఉదయం 11.45 సమయంలో పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకుపైగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకుని తక్షణ కర్తవ్యాన్ని వివరించారు. మధ్యాహ్నం 12.30కు తన నివాసానికి తరలి వచ్చిన అభిమానుల మధ్యకు వెళ్ళి చెరగని చిరునవ్వుతో వారిని పలకరించారు. దాదాపు మూడు గంటల పాటు ఓపికగా అభిమానులతో గడిపిన శ్రీ జగన్ మధ్యాహ్న భోజనానికి‌ చాలా ఆలస్యంగా వెళ్లారు.

సాయంత్రం 5 గంటల సమయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించి అనేక కీలక అంశాలపై చర్చించారు. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలతో సమావేశాలు కొనసాగించారు. శ్రీ జగన్‌లో ఏమాత్రం మార్పు కనిపించలేదని, గతంలో ఎంత సునిశితంగా ఆయా అంశాలను పరిశీలించి వివరించేవారో ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తున్నారని ప్రముఖ నాయకుడు ఒకరు అన్నారు.

అభిమానుల హోరు :
16 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలైన తమ నాయకుడిని కలుసుకోవడానికి రాష్టవ్య్రాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బుధవారం శ్రీ జగన్ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే అభిమానులు లోట‌స్‌పాండ్‌కు చేరుకోవడం మొదలైంది. ఉదయం 10 గంటలకే ఆయన నివాస పరిసర ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. వృద్ధులు, మహిళలు, యువకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ‘జై జగన్‌..’ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సుదీర్ఘకాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడిని స్వయంగా కలుసుకున్న ఆనందంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ జగన్‌తో కరచాలనం కోసం యువకులు పోటీపడ్డారు. తన కోసం వచ్చిన వారందరినీ ఆయన పలకరిస్తూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ప్రతిరోజూ అభిమానులను కలవనున్న జగన్‌ :
జననేత తనను చూసేందుకు రాష్టవ్య్రాప్తంగా కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా తరలివస్తున్న నేపథ్యంలో వారెవరినీ నిరాశపరచకూడదని శ్రీ జగన్ భావిస్తున్నారు. గురువారం నుంచి ప్రతిరోజూ ఉ. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి‌ గంట వరకు లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆయన కలుసుకుంటారు.

Back to Top