చంద్రమాయ


అంతుపట్టకుండా ఏదైనా జరిగితే అంతా మహావిష్ణు మాయ అంటారు. కానీ ఎపిలో మాత్రం అంతా చంద్రమాయ అనే అనాలి. ఎందుకంటే రాష్ట్రంలోని భూముల విషయంలో జరిగేదంతా మాయే. భూమి తాలూకు పాస్ బుక్ ఒకరిపేర ఉంటుంది. కానీ భూమి మాత్రం ఇంకెవరి పేరనో నమోదై ఉంటుంది. అండంగల్ ఉన్న భూములకు ఆర్ఎస్ఆర్ కు మధ్య లక్షల ఎకరాల తేడా ఉంటుంది. తమ పేరు వెబ్ లాండ్ లో నమోదు చేయించుకునేందుకు సాధారణ రైతులు పాసుబుక్కులు పుచ్చుకుని రెవెన్యూకార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కానీ అధికార పార్టీ సిఫార్సులుంటే వెంటనే వెబ్ లాండ్ లో నమోదులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. 
తప్పుల తడకల రికార్డులు
భూమికి సంబంధించి పట్టాల్లో తప్పులుంటే రెవెన్యూ శాఖ రికార్డులు పరిశీలించి వాటిని సరిచేసేవారు. కానీ ఇప్పుడు రెవెన్యూ రికార్డులన్నీ గజిబిజి గందరగోళంలా ఉన్నాయి. లక్షల ఎకరాల భూముల రికార్డులు ఇంత అడ్డదిడ్డంగా మారడానికి కారణం అధికారపార్టీని అడ్డుపెట్టుకుని నేతలు చేస్తున్న అక్రమాలే. రెవెన్యూశాఖను గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి సొంతవాళ్లకు అంతా అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. కొందరు ప్రభుద్ధులు ప్రభుత్వ భూములనే తమ పేర నమోదు చేసేసుకుంటే, మరి కొందరు ప్రైవేటు భూములనూ ఆక్రమించుకున్నారు. అక్రమార్కుల సంగతి అలా ఉంటే ప్రభుత్వాలు చేసిన తప్పులూ కోకొల్లలే. పేదలకు పంచే అసైన్ మెంట్ భూముల్లో కూడా ఒకే భూమికి ఎక్కువ మంది చేతుల్లో పట్టాలున్నాయి. ఒక సర్వే నంబర్లో 30 ఎకరాల భూమికి సంబంధించి పట్టాలు చూస్తే అదే సర్వే నెంబర్లో 50 ఎకరాలు ఉన్నట్టుగా ఉన్నాయి. నకీలీ పత్రాలు, బినామీ పేర్లతో నమోదులు, భాగస్వామ్య పరిష్కారంలో ఉన్నదానికంటే ఎక్కువ భూమి రాసుకోవడం ఇలాంటి సమస్యలతో భూరికార్డుల పరిస్థితి లోపభూయిష్టంగా తయారైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రం మొత్తంలో ఆర్ఎస్ఆర్ అడంగల్ మధ్య 33,54,169 ఎకరాల వ్యత్యాసం ఉండటం చూస్తే నికరంగా లెక్కలు తీస్తే ఈ తేడా ఇంకెంత ఉంటుందో అని అనిపించకమానదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో జరుగుతున్న తంతు వల్ల సామాన్యుల పాలిటి శాపం అయ్యింది. 
 
Back to Top