గోబెల్స్‌ థియరిలో బాబు పాలన

 – అబద్ధాల ప్రచారం ఆరితేరిన ముఖ్యమంత్రి

– చేతకానితనం బయటపడకుండా ఇతరుపలై విమర్శలు

– పరనింద, ఆత్మస్తుతిలతో నిండిన మూడు రోజుల మహానాడు 

 అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం
అవుతుందన్న గోబెల్స్‌ థియరీ ప్రకారం మూడు రోజుల మహానాడు కార్యక్రమాన్ని చంద్రబాబు
మమ అనిపించారు. ఫలానా చేశాము..,
రాబోయే రోజుల్లో ఫలానా పనులు
చేయబోతున్నాం.. మా ప్రణాళిక ఇలా ఉండబోతుందని ప్రజలకు చెప్పడం బదులు సోత్కర్ష, పరనిందలతో మహానాడును
మాయనాడుగా మార్చేశారు. నాయకులు ఎక్కడ లైను దాటుతారేమోనని చంద్రబాబు భయం.. అందుకే
రోజూ ఒక గంటో గంటన్నర పాటు తాను మాట్లాడి అదే లైనులో మిగతా నాయకులు కూడా
మాట్లాడాలని ఇన్‌డైరెక్టుగా చెప్పడం ఆనవాయితీ. కనీసం నలుగురైదుగురు భజన నాయకులను
ఆయన మాట్లాడిన వెంటనే రంగంలోకి దింపి ప్రసంగింపజేస్తారు. చంద్రబాబుకు ఎవరి మీదనైతే
కోపం ఉంటుందో వారిని తిట్టించడానికి తమ పార్టీలోని అదే కులపోళ్లని రంగంలోకి దింపి
సంబరపడిపోతాడు. పక్కనోళ్లను తిట్టినప్పుడు ఆ ప్రసంగాన్ని మరింత రక్తి
కట్టించడానికి చంద్రబాబు ముసిముసి నవ్వులతో కుర్చీలో నుంచి రెండు మూడుసార్లు కింద
పడి లేస్తాడు. ఇదీ చంద్రబాబు థియరీ.. 

 అన్నీ సమాధానం లేని ప్రశ్నలే...

 కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను
అశాస్తీ్రయంగా విభజించింది అంటూ ముఖ్యమంత్రి కాక ముందు నుంచీ మైకు
దొరికినప్పుడల్లా ఆడిపోసుకున్న చంద్రబాబు.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నాటి
నుంచి మాట్లాడ్డం మానేశాడు. ఇటలీ భూతం అని సోనియాను తిట్టిన చంద్రబాబు కర్నాటక
వేదికగా రాహుల్‌గాంధీ చెట్టాపట్టాలు వేసుకున్న తీరును జనమంతా చూశారు. ఉన్నట్టుండి
రాహుల్‌తో కలవాడానికి కారణం జనానికి అర్థం కాలేదు. నాలుగేళ్లుగా పొగిడిన నోటితోనే
మోడీని, బీజేపీని తిట్టడం మొదలెట్టాడు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో
నాలుగేళ్లు ఎందుకు ప్రయాణం చేశారో చెప్పనే లేదు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే
బాగుందని..హోదాతో ఏమొస్తుందని.. హోదా పేరెత్తితే జైలుకే అన్న మనిషి యూటర్న్‌
తీసుకున్న విషయంపై సమాధానం చెప్పలేదు. 

 ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక
ప్యాకేజీ ఏమీలేదు. ఉద్దానం కోసం కుప్పంకు వెళ్లాల్సిన వాటర్‌ ప్లాంట్‌ను
తరలించామని లోకేష్‌ చెప్పాడే తప్ప.. ఇచ్చిన హామీలు పది శాతం కూడా నెరవేర్చలేదని
స్థానికులు చాలా మంది చెప్పారు. మహానాడుకు ముందు పత్రికల్లో పతాక శీర్షికల్లో
వార్తలొచ్చాయి. అయినా ఉద్దానాన్ని ఉద్ధరించింది లేదు. విశాఖకు రైల్వేజోన్‌
సాధిస్తామని గతేడాది మహానాడులో చెప్పారు.. దాని సాధన కోసం ఒక్క పోరాటం కూడా
చేసింది లేదు. పదిహానేళ్లు ప్రత్యేక హోదా కావాలని వెంకన్న సాక్షిగా కోరిన మనిషి
దాన్ని ఎందుకు అటకెక్కించారు.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాకే మళ్లీ ఎందుకు
కావాలనుకుంటున్నారు ప్రజలకు చెప్పాల్సింది. రోజుకు కోట్ల రూపాయలతో చేసిన సమర
దీక్షలు, నవ నిర్మాణ దీక్షలతో ఏం సాధించారో చెప్పాలి. పోలవరం 2018
కల్లా కడతా.. రాసి పెట్టుకో అన్న టీడీపీ
నాయకులు ఏమై పోయారు. పోలవరం నిర్మాణం అగమ్యగోచరంగా మారడానికి కారణమైన బాబు..
రాబోయే ఏడాదిలో ఏం చేయబోతున్నారో చెప్పనేలేదు. రాజధాని నిర్మాణం ఇక
ఆగిపోయినట్టేనా..? లక్షల్లో ఐటీ ఉద్యోగాలు అని చెప్పిన ఐటీ మంత్రి లోకేష్‌..
ఉద్యోగాలు పొందిన వారి పేర్లు బయట పెట్టమని విపక్షాలు డిమాండ్‌ చేస్తే సమాధానం
లేదు. ఇలా తన చేతకాని తనాన్ని ప్రజలకు తెలియకుండా ఉండటానికి విమర్శలు వచ్చిన
ప్రతిసారీ విపక్షాల మీద బురద జల్లడం.. పోలవరం పూర్తవకపోయినా, రాజధాని
కట్టలేకపోయినా అన్నింటికీ వేరెవరో కారణమని ప్రచారం చేయడం.. నాయకులు చేత చెప్పించడం
తప్ప బాబు సాధించిందేమీ లేదు.

 

Back to Top