అవినీతి,.. అరాచకం.. దోపిడీ

– చంద్రబాబు పాలనపై మాజీ సీఎస్‌లు
– నారా పాలనను తూర్పారాబట్టిన అజేయ్‌ కల్లాం, ఐవైఆర్‌ కృష్ణారావు
– ఏకపక్ష నిర్ణయాలతో పాలన సాగుతోందని ఎద్దేవా 
– రాజధాని భూ ఆక్రమణలు, స్విస్‌ ఛాలెంజ్‌ను వద్దన్నామని వెల్లడి
– విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ దర్యాప్తుపై ఆగ్రహం


రికార్డులను తారుమారు చేసి లక్షల ఎకరాలు కబ్జాకు పాల్పడిన విశాఖ భూ కుంభకోణం రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీది. రాజధాని పేరుతో రైతుల నుంచి మూడు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడం ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి ఓ కామధేనువులా భావిస్తోంది. అందుకే ప్రాజెక్టు పూర్తి కావడం లేదు.  
–ఐవైఆర్‌ కృష్ణారావు 

పేదలకు పని కల్పించేందుకు వినియోగించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు లాంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఐటీ కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి సాగుతోంది. ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన వేలాది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తోంది.   
– అజేయ్‌ కల్లాం
ఐవైఆర్‌ కృష్ణారావు 2013 మే నుంచి 2014 జూన్‌ 1వ తేదీ వరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ)గా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్‌ 2వ తేదీ నుంచి 2016 జనవరి నెలాఖరు వరకు ఏపీకి తొలి సీఎస్‌గా వ్యవహరించారు. అజేయ్‌ కల్లాం 2014 జూన్‌ 2 నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా 2017 ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగారు. దీంతోపాటు రెవెన్యూ ప్రత్యేక సీఎస్‌గా కూడా కొన్నాళ్ల పాటు బాధ్యతలు పర్యవేక్షించారు. 2017 మార్చి 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో అజేయ్‌ కల్లాం విధులు నిర్వర్తించారు. 

పదవీ విరమణ చేసిన అనంతరం టీడీపీ సర్కారు సాగిస్తున్న అరాచకాలు, అవినీతిపై ఇద్దరు మాజీ సీఎస్‌లు ప్రభుత్వ డొల్లతనాన్ని తూర్పారా పడుతున్నారు. అక్రమ భూ కేటాయింపులు, అమరావతిలో స్విస్‌ఛాలెంజ్‌ విధానంపై మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. విశాఖ భూ  కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు జరిగిన విధానంపైనా బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సంతర్పణ.. అనుకూల కంపెనీలకు భూ కేటాయింపులు.. సెక్రటేరియట్‌లో ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ. 11,666 ఖర్చు చేయడం మాజీ సీఎస్‌లతోపాటు ఏపీ ప్రజలందర్నీ విస్మయ పరిచింది. దానిని బట్టే అర్థమవుతోంది.. కాంట్రాక్టర్లు, కంపెనీల నుంచి లోకేష్, చంద్రబాబులకు ఎంత భారీగా కమీషన్లు ముట్టాయో. ప్రజలు తమ ఇష్టప్రకారం కొనుక్కునే సెట్‌ టాప్‌ బాక్సులను సైతం పంపిణీ చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు తన సన్నిహితుడికి కట్టబెట్టారు. కాగా రూ. 1500 లు విలువజేసే సెట్‌టాప్‌ బాక్సులకు ప్రభుత్వం 4 వేలు చెల్లించడం ప్రభుత్వ సొమ్మును దోచుకోవడమే. ఈ బాక్సుల కొనుగోళ్లకు ప్రభుత్వం రూ. 4వేల కోట్లు అప్పులు చేయడమే కాకుండా దానికి గ్యారెంటీ కూడా ఇస్తోంది. ఇవన్నీ అటుంచితే సాగు నీటి ప్రాజక్టుల్లో జరుగుతున్న కమీషన్లకు హద్దే లేదు. ప్రాజెక్టులు పూర్తి చేసింది లేకపోయినా ఇష్టానుసారం అంచనాలు పెంచుకుంటూ ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారు. సోమవారం పోలవరం అని పేరు చెప్పుకుంటూ పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప పనుల్లో పురోగతి లేదు. రాష్ట్రం విడిపోయే నాటికి రూ. 16 వేల కోట్లతో సిద్ధమైన పోలవరం అంచనాలను అమాంతం పెంచేసి రూ. 58వేల కోట్లకు చేర్చడం చూస్తుంటే ప్రాజెక్టుల పేరు చెప్పి చంద్రబాబు చేస్తున్న దోపిడీకి అద్దం పడుతోంది. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం సెల్‌ఫోన్లు కొనుగోలు చేసి ఇస్తూ అందులోనూ భారీ అవినీతికి తెరతీసింది. తొలుత ఐదు లక్షల సెల్‌ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొన్నట్లు చూపిస్తూ రూ. 150 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. సెల్‌ఫోన్ల కొనుగోళ్లకు మరో రూ.403 కోట్లు కావాలంటూ ఐటీ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. పారిశ్రామిక, ఐటీ రాయితీల పేరుతో ప్రాజెక్టు స్థాపనకు అయ్యే వ్యయానికి మించిపోయి ఖజానా నుంచి రాయితీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటో తేలిగ్గానే ఊహించవచ్చని పేర్కొంటోంది. ప్రైవేట్‌ వ్యక్తులు చేయాల్సిన టవర్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేయటాన్ని తప్పుబడుతున్నారు. వీటన్నింటితోపాటు మరో కీలక విషయం బయటపెట్టారు అజేయ్‌ కల్లాం. చంద్రబాబు, లోకేష్‌ల అక్రమాలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంచేందుకు.. తన అసమర్థను కూడా సమర్థతగా చూపించేందుకు రెండు తోక పత్రికలకు చంద్రబాబు వేల కోట్లు దోచిపెట్టారనేది మరో కీలక ఆరోపణ. 

తాజా వీడియోలు

Back to Top