- అసెంబ్లీ నెల రోజులు నిర్వహించాలి
- మొక్కుబడి సమావేశాలు దారుణం
- ఇంతవరకు ఆయనకు ప్రజా సమస్యలు తెలియవనుకోవాలా!
- కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన ఖర్మ మా పార్టీకి పట్టలేదు
- చంద్రబాబే టీడీపీని కాంగ్రెస్లో కలిపేసేలా ఉన్నారు

హైదరాబాద్, 9 సెప్టెంబర్ 2012: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మొక్కుబడి తంతుగా ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావించడం గర్హనీయమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కనీసం 30 రోజులైనా అసెంబ్లీని నడపాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారంనాడు వారు విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రజలు విద్యుత్ కోత సహా అనేక సమస్యలతో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించాలనుకోవడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అసెంబ్లీలో సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధి ప్రతిపక్షానికి లేదని తెలిపారు. అందుకే ప్రజాపక్షంగా తాము ఈ డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

ప్రతిపక్ష పాత్రలో విఫలమై, ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పాదయాత్ర చేస్తానని అంటున్నారని, ఆయన వ్యవహారం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని కృష్ణదాస్, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి ఎద్దేవా చేశారు. పేదలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వైయస్ రాజశేఖర్‌రెడ్డి మండుటెండల్లో వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ప్రజల సమస్యలేమిటో దగ్గరి నుంచి చూసి అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించే దిశగా ఆలోచనలు చేశారని వారు తెలిపారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, కరెంటు బకాయిల మాఫీ, జలయజ్ఞం వంటివన్నీ పాదయాత్ర ఫలితంగా వైయస్‌కు వచ్చిన ఆలోచనలేనని వారు పేర్కొన్నారు.

‘తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి గత ఎనిమిదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర చేస్తాననడాన్ని చూస్తుంటే ఇప్పటివరకూ ఆయనకు ప్రజా సమస్యలేవీ తెలియవనే అనుకోవాలా..!’ అని ప్రశ్నించారు. ‘తెలియవంటే.. ఆ మాట చెప్పి పాదయాత్రకు వెళ్లమనండి..’ అన్నారు. ఊటీ లాంటి చల్లని వాతావరణం ఉండే సమయంలో బాబు యాత్రకు పూనుకోవడాన్ని బట్టే ఆయన చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతోందన్నారు.

‘వర్షానికి వానదేవుడు, నిప్పుకు అగ్గిదేవుడని పేర్లున్నాయి. చంద్రబాబును ప్రజలు కరువు దేవుడనుకుంటున్నారు. వినాయక చవితి రానున్నది కనుక అంతకు ముందే చంద్రబాబు దృష్టి ఎక్కడ తగులుతుందోనని ప్రజలు భయపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. సబ్సిడీలు పులిమీద స్వారీ లాంటివని, ప్రాజెక్టులు దండుగ అని.. ఇలాంటివెన్నో చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది కనుక చంద్రబాబు నిజంగా అధికార పక్షాన్ని ఇబ్బందుల్లో పెట్టాలనుకుంటే శాసనసభ సమావేశాల తొలిరోజునే అవిశ్వాస తీర్మానం పెట్టాలని, అందుకు తాము మద్దతునిస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

దివాళా తీస్తున్న పార్టీలతో విలీనమా..!
‘వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన కర్మ పట్టలేదు. అసలు ఆ ప్రశ్నే తలెత్తదు. ఈ రోజు ఎన్నికలు జరిగితే సొంతంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉంది. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనే జగన్‌కు మంచి ప్రజాదరణ ఉన్నప్పుడు మరో పార్టీతో విలీనం కావాల్సిన అవసరం మాకేముంది? మొన్నటి ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌కు 47 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా అన్ని పార్టీలు కలిసినా వాటికి 43 శాతం ఓట్లు కూడా రాలేదు. కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలు పలు చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్నాయి. దివాళా తీస్తున్న పార్టీలతో విలీనం కావాల్సిన అవసరం మా పార్టీకి లేదు.. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతున్న ప్రచారం’ అని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

విజయమ్మ అనని మాటలను ఓ వర్గం మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే ఈ తరహా ప్రచారానికి అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. జైలు నుంచి జగన్ బయటకు రాకుండా తాము ఎలా ప్రయత్నాలు చేస్తున్నదీ కొందరు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు స్వయంగా తమతోనే అన్నారనీ, వారి పేర్లను సైతం తాము బయటపెట్టగలమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పారు.

సీబీఐ రకరకాలుగా చార్జిషీట్లు వేయడాన్ని బట్టే జగన్‌కు బెయిల్ రాకుండా ఎలా అడ్డుకుంటున్నదీ అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు ప్రస్తుత వైఖరి చూస్తూంటే ఆయనే కాంగ్రెస్‌లో విలీనం అవుతారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తన పార్టీ ఎంపీలను బయటే నిలబెట్టి లోపల ఏకాంతంగా భేటీ అయ్యారని, ప్రజా సమస్యలపై వెళ్లినపుడు బహిరంగంగా మాట్లాడాలే తప్ప లోపల మాట్లాడేవి ఏముంటాయని ప్రశ్నించారు. చీకట్లో చిదంబరాన్ని కలవడం, కర్ణాటక గవర్నర్‌ను కలవడం చూస్తే టీడీపీయే కాంగ్రెస్‌లో విలీనం అయ్యేలా ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు.