మంత్రి నారాయణవి మాయమాటలు

నెల్లూరు: షాదీమంజిల్‌ పునర్నిర్మాణంపై మంత్రి నారాయణ మాయమాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ సొంత జిల్లా నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు రెగ్యులర్‌ కమిషనర్‌ లేకపోవడం మంత్రి పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సోమవారం ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 43వ డివిజన్‌ జెండా వీధి, బందుల వీధి, కామాటి వీధి ప్రాంతాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్‌లో మూడు నెలలుగా రెగ్యులర్‌ కమిషనర్‌ లేకపోవడంతో అనేక ఇబ్బందులు తాండవిస్తున్నాయని చెప్పారు. షాదీ మంజిల్‌ నిర్మాణం చేపట్టాలని అసెంబ్లీలో సైతం మంత్రిని కలిసి కోరినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. ముస్లింలు ఎక్కువగా నియమించే 43వ డివిజన్‌లో కోటి రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ. 30 లక్షలు షాదీ మంజిల్‌కు కేటాయించామని మాయమాటలు చెప్పడం కాకుండా ఏప్రిల్‌ నెలలో నిర్మాణ పనుల టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తన సొంత నిధులతో, ముస్లిం మైనార్టీ సభ్యుల సహకారంతో షాదీమంజిల్‌ పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనిల్‌ వెంట హంజాహుస్సేనీ, మీరామొహిద్దీన్, ఫజల్‌ అహ్మద్, అథహర్‌ బాషా, అహ్మద్, రియాజ్, షేక్‌ బాషా, తారీఖ్‌ అహ్మద్, కరీమ్, మున్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 
Back to Top