- గోదావరి పుష్కరాలపై సోమయాజులు కమిషన్ నివేదిక– చంద్రబాబును కాపాడేందుకు తప్పుడు నివేదిక ఇచ్చారు– గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారు– చంద్రబాబు ప్రచార యావకు 30 మంది భక్తుల ప్రాణాలు బలి
అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పదం ఏమీ లేదని, తప్పంతా ప్రజలదే అని సోమయాజులు కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో తన ప్రచార యావ కోసం సినిమా షూటింగ్ చేయించుకుంటూ, భక్తులను ఆపడంతోనే తొక్కిసలాట జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ..గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది అనడానికి సోమయాజులు నివేదికే నిదర్శమన్నారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో అంతమంది ప్రాణాలు కోల్పోతే కలెక్టర్ అప్పట్లోనే నివేదిక ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్నానం చేసే సమయంలో భక్తులను ఆపడం వల్ల రద్దీ ఎక్కువై తొక్కిసలాట జరిగిందని అప్పట్లో కలెక్టర్ నివేదిక చాలా స్పష్టంగా ఉందన్నారు. ఆ నివేదికను తొక్కిపెట్టి, కలెక్టర్‌కు చీవాట్లు పెట్టిన ప్రభుత్వం ..ఇన్ని రోజుల తరువాత సోమయాజులు కమిషన్ అంటూ కొత్త నాటకాలు ఆడుతుందన్నారు. ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోకుండా భక్తులపై నెపం నెట్టడం బాధాకరమన్నారు. మూఢనమ్మకం, గుడ్డి విశ్వాసంతో ప్రజలు పుష్కరాలలో స్నానం చేసేందుకు వచ్చారని నివేదిక ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. భక్తులపై ఆరోపణలు చేయడం ఇంతవరకు ఏ ప్రభుత్వం పేర్కొనలేదని, చంద్రబాబు తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా సోమయాజులు నివేదిక ఉందన్నారు. పుష్కరాల్లో ముహుర్తమని ప్రచారం చేసింది ప్రభుత్వమే అని, ఇవాళ ప్రజల్లో గుడ్డి నమ్మకం అని భక్తులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసలు నివేదిక రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైందన్నారు. ముఖ్యమంత్రికి పుష్కరాలలో బాధ్యత లేదని చెప్పేందుకు ఇవాళ నివేదికను తెరపైకి తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి ప్రచార యావ వల్లే పుష్కరాల్లో అంతమంది భక్తులు మృత్యువాత పడ్డారన్నారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు మూడేళ్ల తరువాత నివేదిక బయటపెట్టారని విమర్శించారు. చేసిన పాపానికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోకతప్పదని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.