శిల్పది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

నేరస్తులకు కొమ్ముకాస్తూ మహిళల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు
మొన్న రిషితేశ్వరి, నిన్న డాక్టర్‌ సంధ్య, నేడు శిల్ప
ఇంకా ఎంతమందిని పొట్టనబెట్టుకుంటావు చంద్రబాబూ?
దోషులను శిక్షించకుండా నివేదిక ఎందుకు దాచిపెట్టారు?
శిల్ప మృతిపై సీఐడీ ఎంక్వైరీ కేసును నీరగార్చడమే
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం
తిరుపతి: ఎస్వీ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని శిల్పను ప్రభుత్వమే హత్య చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. శిల్పా కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, ఆడవారు రోడ్డు మీద నడిచే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, నారాయణ కళాశాలల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు, మొన్న రిషితేశ్వరి, నిన్న డాక్టర్‌ సంధ్యారాణి, నేడు శిల్ప ఇలా అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నేరం చేసేవారికి చంద్రబాబు అండాదండా ఉండబట్టే ఇంకా మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మహిళలపై నేరాలు ప్రతీ ఏడాది 11 శాతం పెరిగిపోతున్నాయని పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలన్నింటి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని, వారిని కాపాడడం కోసం చంద్రబాబు కేసులను నీరుగారుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్ప విషయం కూడా అదే జరుగుతుందన్నారు. 

శిల్ప తనపై జరుగుతున్న లైంగిక వేధింపులపై గవర్నర్‌కు నాలుగు నెలల క్రితమే లేఖ రాసిందని, గవర్నర్‌ కూడా వెంటనే స్పందించి కలెక్టర్‌కు విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కలెక్టర్‌ ఒక కమిటీ వేసి నివేదిక సమర్పించాలని కోరారు. నివేదికలో దోషులుగా ఉన్న వారిని ఎందుకు అరెస్టు, సస్పెండ్‌ చేయలేదని ప్రశ్నించారు. పీజీ విద్యార్థిని ప్రభుత్వంతో కలిసి హెచ్‌ఓడీ, ప్రొఫెసర్లు హత్య చేశారని ధ్వజమెత్తారు. అలాంటి మృగాలను అరెస్టు చేయకుండా వారిని తప్పించే ప్రయత్నంలో భాగంగానే నివేదిక దాచిపెట్టారన్నారు. శిల్ప మృతిపై ఎంక్వైరీ సీఐడీ ఎంక్వైరీ వేయడం కేసును నీరుగార్చడమేనని అభిప్రాయపడ్డారు. విచారణ కంటే నివేదిక బయటపెడితే ఏం జరిగిందో తెలిసిపోతుందన్నారు. 

సొంత జిల్లాలో ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అండగా నిలవకుండా చంద్రబాబు, లోకేష్‌ నేరస్తులకు సపోర్టు చేయడం సిగ్గుచేటని రోజా విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ పోకడలు చూస్తున్నారు కాబట్టే జూనియర్‌ డాక్టర్లంతా ఏకమై.. ఇలాంటి ఘటన మరొక అమ్మాయికి జరగకూడదని న్యాయం కోసం పోరాడుతున్నారన్నారు. దాన్ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఎక్కడో కూర్చొని ఏ విధంగా సమస్యను పక్కదోవపట్టించాలని ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఆడపిల్లలు వంటింటికే పరిమితం అయ్యేలా చంద్రబాబు పాలన ఉందన్నారు. జూనియర్, సీనియర్‌ డాక్టర్ల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటూ జూనియర్స్‌ను బయపెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఓ జాతీయ సంస్థ చేసిన సర్వేలో దేశం మొత్తంలో మహిళలను వేధింపులకు గురిచేసిన నలుగురు మంత్రుల పేర్లు బయటపెడితే అందులో ఇద్దరు చంద్రబాబు కేబినెట్‌ మంత్రులు అచ్చెంనాయుడు, దేవినేని ఉమాలు ఉన్నారన్నారు. అంటే టీడీపీ మహిళలపై జరుగుతున్న అరాచకాలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. శిల్ప మృతికి కారణమైన వారిని జీవితాంతం జైల్లో పెట్టడమే కాకుండా.. ఆ కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేవారు. శిల్పకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, శిల్ప భర్తతో కలిసి చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలమంతా కలిసి గర్నవర్‌ను కలిసి న్యాయం కోసం పోరాడుతామన్నారు. 
 
Back to Top