వైయస్‌ జగన్‌పై దాడి వెనుక ప్రభుత్వం కుట్ర


– హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని వదిలిపెట్టకూడదు
 
హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అనుమానం వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం హత్యాయత్నం చేయించారని ఆమె మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదా కోసం క్యాండిల్‌ ర్యాలీ చేసేందుకు వెళ్లిన వైయస్‌ జగన్‌ను రన్‌వే పై నిర్భందించారని గుర్తు చేశారు. ఇవాళ లాంజ్‌పై దాడి జరిగిందంటే ప్రభుత్వ నిఘా వైఫల్యమే కారణమన్నారు.  దీని వెనుక ఎవరున్నాకూడా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్న వైయస్‌ జగన్‌ను అంతమెందించేందుకు కక్షసాధింపుగా హత్యాయత్నానికి ప్రయత్నించారని, ఇలాంటి చర్యలు సరైనవి కావన్నారు. ఓ వెయిటర్‌ కత్తి పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు గాజులు తొడుక్కొన్నారా అని ప్రశ్నించారు. అతన్ని ఎవరు సపోర్టు చేస్తున్నారని నిలదీశారు. టీడీపీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ప్రజల మధ్య ఉన్న ప్రతిపక్ష నాయకుడిపై ఇలాంటి దాడులు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేదని ధ్వజమెత్తారు. ఆ కత్తికి ఏ విషం పూసి తగిలించారో అని అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌పై దాడి జరిగినా కూడా ఎల్లోమీడియా సిల్లీగా తీసుకోవడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఏ వర్గం మీడియా ప్రయత్నించడం సరికాదన్నారు. వైయస్‌ జగన్‌ను పోలీసులు కాపాడలేకపోయారని విమర్శించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమె డిమాండు చేశారు.
 
Back to Top