ఇద్దరు సీఎంలు కేంద్రంపై పోరాటం చేయాలి


– రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
– రైతు బంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం
– సంపూర్ణ రుణమాఫీ కావాలి
– రాజన్న పాలన తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ కృషి
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతులకు మద్దతు ధర వచ్చేలా కేంద్రంపై పోరాటం చేయాలని ఆయన సూచించారు. రైతులను విస్మరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు ప్రతిది కూడా ఒక మోసపూరిత వైఖరితో   అవలంభించారన్నారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఆయన 30 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రతి సారి అసెంబ్లీ సీట్లు పెంచమని కోరారు..కేసులను కొట్టివేయాలని ప్రాధేయపడ్డారని విమర్శించారు. ఏపీలో పంటలకు గిట్టు బాటు ధర కల్పించాలని ఒక్కసారి కూడా అడిగిన పాపాన పోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్షచూపుతుందన్నారు.  ఉత్తరాది రాష్ట్రాలకు  ఒక రేటు..దక్షిణాది రాష్ట్రాలకు మరో రేటు ఇచ్చారన్నారు. ఇక్కడ పండే శనగ పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరలు కల్పించడం లేదున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి మేం స్వాగతిస్తున్నామని, లాభసాటి ధరలు లేకపోతే రైతులు అభివృద్ధి చెందడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్‌కు ఓటు వేయమని చంద్రబాబు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కర్నాటకలో ఆ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడితే..ఆ పథకాలు చంద్రబాబుకు కనిపించడం లేదని విమర్శించారు. ఉత్పత్తి వ్యయం పెరిగిందని, మద్దతు ధర లేకపోవడంతో రైతాంగం అప్పుల ఊబిలో చిక్కుకుందన్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై పోరాటం చేసి రైతులకు మేలు చేయాలని డిమాండు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు మంచి రేట్లు వచ్చాయని, అలాంటి పాలన తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు. మహానేత చేపట్టిన అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని డిమాండు చేశారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని కోరారు. 
 
Back to Top