ఏపీ అసెంబ్లీ: ప్రశ్నోత్తరాల సమయంలో బీసీ సంక్షేమంపై చర్చకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది రూపాయలు ఫీజులు చెల్లించారని, టీడీపీ పాలనలో రూ.650 కోట్ల బకాయిలు ఉన్నాయని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. తెలంగాణలో ఏపీకి చెందిన 12వేల మంది విద్యను అభ్యసిస్తున్నారని, వారికి కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.30 వేలు ఇవ్వడంతో చదువులు ముందుకు సాగడం లేదన్నారు. బీసీ సంక్షేమంపై మాట్లాడే అవకాశం కల్పించాలని వెల్‌లోకి దూసుకెళ్లి వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల నిరసన తెలిపారు. అయినా పట్టించుకోకుండా స్పీకర్ నీటి సమస్యపై చర్చను కొనసాగించడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. బీసీ వ్యతిరేకి చంద్రబాబు అని నినదించారు.