వైయస్ కళ్లలోకి చూసే ధైర్యముందా?

హైదరాబాద్, 26 ఆగస్టు 2012: 'దివంగత వైయస్­ రాజశేఖరరెడ్డి సజీవంగా వచ్చి తనను విమర్శిస్తున్న మంత్రుల ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగల ధైర్యముందా? ’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్­ విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. ‘మరణించిన వైయస్­ తిరిగి వచ్చి జవాబు చెప్పుకోలేరనే ఆయన గురించి అన్యాయంగా మాట్లాడుతున్నార'ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్­ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా జగన్‌ను జైలుకు పంపినా వైయస్­ ఫొటో లేకుండా చేసినా నోరు మెదపని మంత్రులు ఇపుడు వైయస్­ను ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.

‘ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. రకరకాల కథలు అల్లిస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఒక మంత్రి అంటున్నారు.. ఆయనకు కనుక పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే వైయస్­ హయాంలో జరిగినవన్నీ చెబుతారట! ఇంకొక మంత్రి అంటున్నారు.. తనను క్యాంపు ఆఫీసుకు పిలిపించి తనతో సంతకం చేయించారని! ఇంకొకరైతే తాను హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారని చెప్తున్నారు! ఇంకొకరేమో కేబినెట్ నిర్ణయాలన్నీ సమష్టిగా చేసినవేనని.. అందులో ఏమీ లేదు గానీ తెర వెనుక ఏదో బాగోతం నడిచిందని.. అది వారికి తెలియనే తెలియదని అంటున్నారు! ఇంకొకరైతే కేబినెట్ సమావేశాల్లో ఓ రకమైన చర్చ జరిపారనీ ఫైల్లో మాత్రం మరో విధంగా ఉందని అంటున్నారు. ఇంకొకాయన రాజశేఖరరెడ్డిగారు చాలా పవర్­ఫుల్ అని.. ఆయన ముందర ఏమీ మాట్లాడలేక పోయామని చెప్తున్నారు!’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్­లో ఆదివారం ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడారు.

ఈ మంత్రులు ఆ రోజు ఎందుకు నోరు విప్పలేదు?

ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి నాలుగుసార్లే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తోందని.. అదే వైయస్­ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నెలకు రెండుసార్లు కేబినెట్ సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, జలయజ్ఞం వంటి అంశాలతో వైయస్­ అధికారులను పరుగులు పెట్టించేవారని గుర్తుచేశారు. అప్పుడు మంత్రులు ఈ విషయాలపై ఎందుకు ప్రశ్నించలేకపోయారని విజయమ్మ నిలదీశారు. ‘ఆ రోజు ఈ మంత్రులు కేబినెట్­లో ఎందుకు మాట్లాడలేకపోయారు? ఏం చేస్తా ఉన్నారు? ఏం చూస్తా ఉన్నారో వారికే తెలియాలి. అపుడు ఏమీ మాట్లాడని వారు ఇపుడిలా మాట్లాడుతుంటే మనసుకు చాలా కష్టం కలుగుతోంది. భాధ అనిపిస్తోంది. వైయస్ సజీవంగా వచ్చి వారి ముందర నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా వీరు చూడగలరా?’ అని ఆమె ప్రశ్నించారు.

ఆ జీవోలు సక్రమమా.. అక్రమమా.. చెప్పరేం?:

అప్పట్లో జారీ అయిన 26 జీవోలు సక్రమమా, అక్రమమా అనేది ప్రభుత్వం ఇంత వరకూ చెప్పటం లేదని విజయమ్మ ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని గుర్తుచేశారు. ‘జీవోలు సక్రమమని చెప్తే జగన్మోహన్­రెడ్డికి మేలు జరుగుతుంది. అక్రమమని చెప్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది.. అందుకే సమాధానం చెప్పటం లేదు’ అని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘అసలు జగన్­కు ఏం సంబంధం..? ఆయన అపుడేమైనా ఎమ్మెల్యేనా? ఎంపీగా ఉన్నారా? మంత్రిగా పనిచేశారా? లేక అధికారిగా ఏమైనా ఉన్నారా?’ అని ఆమె నిలదీశారు.

జగన్­ను విచారణ కోసమని పిలిచి సీబీఐ అన్యాయంగా జైల్లో పెట్టి ఇప్పటికి 90 రోజులైందని వైయస్­ విజయమ్మ ఆవేదనగా చెప్పారు. జగన్­బాబును టార్గెట్­ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు కోర్టుల్లో కేసులు వేసిన దరిమిలా జీవోల విషయమై ప్రభుత్వం కౌంటర్­­ దాఖలు చేసి ఉంటే మంత్రులకు ఈ దుర్గతి పట్టి ఉండేదే కాదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కుమ్మక్కయి వైయస్­నూ జగన్­నూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిట్టటమే పనిగా పెట్టుకున్నాయని విజయమ్మ విమర్శించారు.

వైయస్­ తర్వాత పాలన అస్తవ్యస్తం...:

వైయస్­ ప్రజల మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మూడేళ్లుగా పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడటం లేదనీ పడినా విత్తనాలు లభించడం లేదనీ ఎరువుల ధరలు 300 శాతం పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కరెంటు విషయానికి వస్తే ప్రభుత్వమే గ్రామాల్లో 12 గంటలు కోత అని అధికారికంగా ప్రకటించిందనీ, అయితే, రెండు మూడు గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. దారుణమైన పరిస్థితి కారణంగా ఒక్క పులివెందులలోనే 500 కోట్ల రూపాయల మేరకు చీనీ తోటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరెంత నష్టం జరిగిందో అని విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులు విద్యుత్­ కోత విధించిన కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయని.. 20 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఏ వర్గమూ సంతోషంగా లేదు.. :

ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజల్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని విజయమ్మ పేర్కొన్నారు. ‘ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారింది.. ఫీజుల రీయింబర్స్­మెం­టు పథకం ఉంటుందో లేదో తెలియదు... 2009 ఎన్నికల్లో వైయస్ ఇచ్చింది రెండు హామీలే! ఒక్కొక్కరికి ఇపుడిస్తున్న నాలుగు కేజీల బియ్యం నుంచి ఆరు కేజీలు ఇస్తామని.. వ్యవసాయానికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. ఈ రెండు హామీలనూ ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది’ అని ఆమె దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి..:

వైయస్­ పరిపాలించిన ఐదేళ్ల మూడు నెలల కాలం సువర్ణయుగమని, మళ్లీ అలాంటి పాలన తెచ్చుకునేందుకు పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, వైయస్­ఆర్­ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునే వరకూ కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. వైయస్­ఆర్­ కాంగ్రెస్­ ఒక రాజకీయ పార్టీ కాదని.. మానవతావాద పార్టీ అని ఆమె స్పష్టంచేశారు. వైయస్­ సంక్షేమం, అభివృద్ధిని ఏ విధంగా సమానంగా చూసి ముందుకు తీసుకెళ్లారో తమ పార్టీ కూడా అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తుందన్నారు. గ్రేటర్­ హైదరాబాద్­ కాంగ్రెస్ కార్పొరేటర్­ సింగిరెడ్డి హరివర్ధన్­ రెడ్డి ఈ సభలో విజయమ్మ సమక్షంలో వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీలో తన అనుచరులతో సహా చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, రోజా, రాజ్‌సింగ్‌ ఠాకూర్, కోటింరెడ్డి వినయ్­రెడ్డి, బి.జనక్­ప్రసాద్­, పుత్తా ప్రతాపరెడ్డి, కొల్లి నిర్మలాకుమారి, ఎం.మారెప్ప, డి.రవీంద్రనాయక్­ సహా పలువురు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top