జగన్‌కు సాయంగా ఉండేందుకు అనుమతించండి

హైదరాబాద్‌ :

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షీణించటంతో ఆస్పత్రిలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన సతీమణి శ్రీమతి వైయస్ భారతి శుక్రవారం ‌సిబిఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శ్రీ జగన్‌ తల్లి శ్రీమతి విజయమ్మ లేదా తనను సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు.

ఏ నిబంధన మేరకు వారిని అనుమతించాలని కోరుతున్నారని ఈ సందర్భంగా శ్రీ జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆమరణ నిరాహార దీక్ష చేయటం జైలు నిబంధనలకు విరుద్ధమని, దాన్ని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీక్షపై జైలు నిబంధనల మేరకు చట్టపరిధిలో వ్యవహరించవచ్చని.. అందుకు తమకు అభ్యంతరం లేదని అశోక్‌రెడ్డి తెలిపారు. శ్రీ జగన్‌ను ఈ కోర్టే జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిందని.. రిమాండ్‌లో ఉన్న నిందితునికి సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్షతో శ్రీ జగన్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ప్రస్తుతం ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలోనే.. ఆయన భార్యను లేదా తల్లిని సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతున్నామని తెలిపారు.

 ‘ఆరు రోజులుగా శ్రీ జగన్‌ దీక్ష చేస్తున్నారు. పూర్తి నీరసంగా ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. కీటోన్సు 4 ప్లస్‌ ఉన్నాయి, దీంతో మూత్రపిండాలకు ప్రమాదం ఏర్పడుతుంది. హార్టు బీట్‌ 56కు, షుగర్‌ లెవల్సు 60కి పడిపోయాయి. బీపీ 110/70గా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అందుకే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో శ్రీ జగన్‌కు సాయంగా ఉండాలని కోరుతున్నారు. భార్యను లేదా తల్లిని మాత్రమే అనుమతించాలని కోరుతున్నాం’ అని అశోక్‌రెడ్డి వివరించారు. కోర్టు అనుమతిస్తే తప్ప కుటుంబ సభ్యులను సాయంగా ఉండేందుకు అనుమతించబోమని జైలు అధికారులు పేర్కొంటున్నారని.. తమ కస్టడీలో ఉన్న నిందితునికి సంబంధించి నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఈ కోర్టుకు ఉందని స్పష్టంచేశారు. మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సిబిఐ తరఫున హాజరైన స్పెషల్‌ పిపి విక్రమ్‌ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిబంధనలు అనుమతించవని, మానవీయ కోణంలోనే వారు కోరుతున్నారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని శనివారం ఉదయం 10.30 గంటలకు వెలువరిస్తామని తెలిపారు.

సిబిఐ తీరుతో కన్నీటిపర్యంతమైన శ్రీమతి భారతి:
శ్రీ జగన్మోహన్‌రెడ్డికి సాయంగా ఉండడానికి అనుమతించాలన్న తమ అభ్యర్థనపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయటంతో శ్రీమతి వైయస్‌ భారతి కన్నీటిపర్యంతమయ్యారు. శుక్రవారం తెలంగాణ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించిన నేపథ్యంలో తమ ఆవేదనను కోర్టు దృష్టికి తెచ్చేందుకు భారతి స్వయంగా కోర్టుకు వచ్చారు. శ్రీ జగన్‌కు సాయంగా ఉండేందుకు అనుమతించాలన్న తమ అభ్యర్థనపైనా సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయటంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

‘జగన్‌ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఆస్పత్రిలో ఆయనకు సాయంగా ఉండేందుకు అనుమతి కోరుతున్నాం. ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? మీకు మానవత్వం లేదా? అన్యాయంగా పదిహేను నెలలుగా జైలులో ఉంచారు’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకు ముందు ఇదే అభ్యర్థనపై వీరు దాఖలు చేసిన మెమోను కోర్టు తిరస్కరించింది. ఇట్లా కోరేందుకు ఏ నిబంధనా అనుమతించడం లేదని.. దీనిపై జైలు అధికారులే నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టంచేసింది. దీంతో వెంటనే శ్రీ జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని జైలు అధికారులు పేర్కొన్నారని.. అందుకే ఈ కోర్టును ఆశ్రయించామని వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top