లోకేష్..నీ స్థాయి ఏమిటి అసలు..!

లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు
బాబు అవినీతి, అక్రమాలను ఎండగడతాం
ఢిల్లీ పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు
దేశంలోనే ఏపీని అవినీతిలో నం.1 చేశాడు
త్వరలోనే బాబుకు తగిన బుద్ధి చెబుతారు
ఫిరాయింపుదారులంతా రాజీనామా చేయాల్సిందే
అప్పటివరకు సేవ్ డెమొక్రసీ కొనసాగుతూనే ఉంటుంది
వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందిః అంబటి

గుంటూరుః చంద్రబాబు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రజాధనాన్ని దోచుకొని ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఎరవేస్తున్నారని నిప్పులు చెరిగారు. రెండేళ్లలోనే బాబు లక్షా 34 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిని చూసి ఢిల్లీపెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ...వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయాలని చూస్తున్న బాబు కుట్రలను ఢిల్లీలో అందరికీ వివరించామన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.  

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ను చర్చకు పిలిచే స్థాయి లోకేష్ కు లేదని అంబటి రాంబాబు చురక అంటించారు. టీడీపీ కుట్రలకు వ్యతిరేకంగా పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్ అని అంబటి అన్నారు. ఏనాడు ప్రజల నుంచి గెలవని తండ్రి చాటు బిడ్డ లోకేష్ కూడా సవాల్ లు విసరడం హాస్యాస్పదమన్నారు. మీ ముఖారవిందాలకు వైఎస్ జగన్ అవసరం లేదని మా కార్యకర్తలను చర్చకు పంపిస్తాం మీరు సిద్ధమా అని లోకేష్ కు అంబటి ప్రతి సవాల్ విసిరారు. లోకేష్ తన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 

చర్చ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పెడతారా లేక విజయవాడలో పెడతారో రేపు సాయంత్రానికల్లా టైమ్ , ప్లేస్ చెప్పాలని అంబటి అధికార టీడీపీకి సవాల్ విసిరారు. కరప్షన్ చక్రవర్తి బాబు అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరకుమారుల్లాగా పారిపోవద్దని హెచ్చరించారు. లోకేష్ తన వల్ల కాకపోతే దేవినేని ఉమ, సుజనా చౌదరి లేక ప్రత్తిపాటి వారు కూడా కాకపోతే టీడీపీ పోలీస్ జేడీ రాములును కూడా చర్చకు తెచ్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. మీరు మీ నాన్న ఏవిధంగా దోచుకుంటున్నారో ప్రజలకు తెలుస్తుందన్నారు. చర్చలో గెలవకపోతే మీరు కేసులు పెట్టైనా గెలిపించుకుంటారంటూ ఎద్దేవా చేశారు.

కేంద్రమంత్రులు వైఎస్ జగన్ కు అపాయి మెంట్ ఎందుకిచ్చిందంటూ యనమల మాట్లాడుతున్నాడు. ఆయనకు అసలు సిగ్గుందా అంటూ అంబటి మండిపడ్డారు. అపాయిట్ మెంట్ ఎందుకిచ్చారో విజయవాడలో అరవడం దేనికని వెళ్లి మీ మిత్రపక్ష నేతలనే అడగాలన్నారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి బ్యాంకులకు వందలకోట్లు ఎగ్గొట్టినా ఆయన మంత్రివర్గంలో కలవొచ్చట. ఓటుకు కోట్లు కేసులో రోజూ కోర్టుకు వెళుతున్న రేవంత్ రెడ్డి పార్టీకి అధ్యక్షుడిగా ఉండొచ్చట. కానీ కేంద్రమంత్రులు మాత్రం వైఎస్ జగన్ కు అపాయిట్ మెంట్ ఇవ్వొద్దట. అలా మాట్లాడేందుకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ యనమలపై చిర్రెత్తారు. 

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఢిల్లీ స్థాయిలో బాబు అవినీతి బండారాన్ని బయటపెట్టడంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, అపాయిట్ మెంట్ ఇస్తే పరువు పోతుందని కేంద్రపెద్దల వద్ద బావురుమన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ను విమర్శించే నైతిక హక్కు  చంద్రబాబు, యనమల, లోకేష్ కు లేదని అంబటి అన్నారు.  లోకేష్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అంబటి విమర్శించారు. రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో ఢిల్లీకి వెళ్లిన బాబుకు యూపీఏ గవర్నమెంట్ లో ఒక్క మంత్రి కూడా అపాయిమెంట్ ఇవ్వలేదని అంబటి తెలిపారు. కానీ తాము కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అరుణ్ జైట్లీ , ధర్మేంద్ర ప్రదానును కలుసుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రులు మాకు అవకాశమిచ్చి చెప్పిందంతా విన్నా కూడా ఇంకా లోకేష్ కు అర్థం కాకపోవడం మూర్ఖత్వమన్నారు. 

తాము ఆస్తులు ప్రకటిస్తే వైఎస్ జగన్ ఎందుకు ప్రకటించడం లేదని లోకేష్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాబు ప్రకటించిన ఆస్తులన్నీ అతుకుల బొంత అని అంబటి అన్నారు. అన్నీ అబద్ధాలు చూపిస్తూ అభూత కల్పనలతో ప్రతి సంవత్సరం ఆస్తుల పేరుతో ఓడ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ స్థాయిలో మీరు రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైనాన్ని, ఎమ్మెల్యేలను ఏవిధంగా కొంటున్నారో కేంద్రమంత్రులకు సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఎన్సీపీ నేతలకు తెలియజెప్పామన్నారు.  బాబు చేస్తున్న బాగోతాలు తమకు కూడా అందాయని ఢిల్లీ పెద్దలు చెప్పిన విషయాన్ని అంబటి ధృవీకరించారు. దీనిపై వారు సీరియస్ గా స్పందించారని చెప్పారు. 

టీడీపీలోకి వెళ్లిన వారంతా రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు న్యాయస్థానాల ద్వారా వస్తాయని అంబటి తెలిపారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఫిరాయింపుదారులు  రాజీనామా చేసేవరకు సేవ్ డెమొక్రసీ కొనసాగుతుందని, బాబు చేస్తున్న ఘోరాలను వివరించేందుకు వైఎస్సార్సీపీ నిరంతర కృషి చేస్తుందని అంబటి వెల్లడించారు. బుకాయించే కార్యక్రమాలు చేయడంలో లోకేష్ కూడా వాళ్ల బాబుని మించిపోయాడని అంబటి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుమైన దోపిడీకి త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని అంబటి హెచ్చరించారు. భారతదేశంలోనే అవినీతిలో ఏపీని బాబు నంబర్ వన్ చేశాడని అంబటి దుయ్యబట్టారు. మిత్రపక్షం బాబుకు తొందరలోనే సరైన బుద్ధి చెబుతుందన్నారు. 

Back to Top