విజయవాడలో వైయస్‌ఆర్‌సిపి 'సహకార భేరి'

జగ్గయ్యపేట‌ (కృష్ణాజిల్లా) :  త్వరలో జరిగే సహకార సంఘం ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సంఘాలు కైవసం చేసుకుని, విజయదుందుభి మోగిస్తుందని పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ‌ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో‌ సోమవారం మధ్యాహ్నం జరిగే పార్టీ నాయకుల సమావేశంలో ‘సహకారభేరి’ మోగించనున్నట్లు ఆయన శనివారం ఇక్కడ తెలిపారు. సహకార సంఘం వ్యవస్థకు జవసత్వాలు కల్పించింది మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డే అన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ ఆనాడు నియమించిన వైద్యనాథ్ కమిష‌న్ సూచనల మేరకే ప్రభుత్వం సహకార సంఘం ఎన్నికల నిర్వ‌హణకు సిద్ధమయిందన్నారు. ఆరేళ్ల లోపు సహకార సంఘాలకు తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని వైద్యనాథ్‌ కమిషన్ సిఫార్సు చేయడంవ‌ల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.

2004కు ముందు సహకార రంగం పతనావస్థలో ఉండగా‌ మహానేత వైయస్ ముఖ్యమంత్రి అయిన తరువాత వాటికి అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేశారని సామినేని గుర్తుచేశారు. ‌దీనితో అప్పట్లో జిల్లాలోని 425 సంఘాలకు గాను 300కు పైగా సంఘాలను కాంగ్రెస్ సానుభూతిపరులు కైవసం చేసుకున్నారని గుర్తుచేశారు. వీరిలో మూడు వంతుల మంది ఇప్పుడు వైయస్‌ఆర్ కాంగ్రె‌‌స్‌ పార్టీలో చేరారన్నారు. తమ పార్టీ ఆవిర్భవించిన తరువాత వచ్చిన తొలి ఎన్నికలు అని, వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని 400పైగా సంఘాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
Back to Top