బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా), 16 డిసెంబర్ 2012: వైయస్‌ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సభ ప్రారంభం అవుతుంది. స్థానిక పిటిఎం రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద బహిరంగసభ ఏర్పాట్లు జరిగాయి. టిడిపికి ఇటీవలే రాజీనామా చేసిన తంబళపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు, ప్రవీణ్‌రెడ్డి అనుచరులు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో ఇదే వేదికపై వైయస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న వైయస్‌ఆర్‌సిపి తొలి బహిరంగ సభ కావడంతో విజయవంతం చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఈ సభలో పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేశారు. వేదికపై నుంచి ప్రసంగించే శ్రీమతి విజయమ్మ, ఇతర నాయకులు కనిపించేలా వేదిక సిద్ధమైంది. సభా ప్రాంగణంలో, బి.కొత్తకోటలో ఎటుచూసినా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్రీమతి విజయమ్మకు సాదరంగా స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలిశాయి.
ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి శనివారంనాడు బహిరంగ సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట మదనపల్లె మాజీ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జి.షమీం అస్లాం, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయకుమార్, మదనపల్లె నాయకుడు బావాజాన్ తదితరులు ఉన్నారు. బహిరంగ సభా వేదిక, ప్రెస్ గ్యాలరీ, బారికేడ్ల ఏర్పాట్లను మదనపల్లె డిఎస్‌పి రాఘవరెడ్డి పరిశీలించారు. భద్రతాపరమైన చర్యలను సమీక్షించారు.
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 2009లో తొలిసారిగా టిడిపి తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బలీమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణపై కేంద్రానికి లేఖ రాయడంపై తిరుగుబాటు చేశారు. ఆయనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఈ రోజు వైయస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు.
బి.కొత్తకోటలో విజయమ్మ సభకు హాజరవుతున్న వారి వాహనాల పార్కింగ్‌కు స్థలాలను కేటాయించారు. మదనపల్లె నుంచి వచ్చే వాహనాలు దిగువ బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా రంగసముద్రం రోడ్డులోని పశువుల ఆసుపత్రి వద్ద ఉంచాలి. తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం మండలాల వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా అక్కడే నిలిపి సభ వద్దకు చేరుకోవాలి. పిటిఎం, కర్ణాటక వైపు నుంచి వచ్చే వాహనాలను సభావేదిక సమీపంలోని దేవాదాయశాఖకు చెందిన భూములలో నిలపాలని నిర్వాహకులు తెలిపారు.