వస్త్ర వ్యాపారులకు విజయమ్మ సంఘీభావం

హైదరాబాద్, 19 మార్చి 2013: వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ వ్యాపారులు చేస్తున్న సమ్మెకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సంఘీభావం ప్రకటించారు. వస్త్ర వ్యాపారుల దీక్ష న్యాయబద్ధమైనదే అని ఆమె అభిప్రాయపడ్డారు. వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. వ్యాపారుల అరెస్టును ఆమె ఖండించారు.

అంతకు ముందు వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ వస్త్ర వ్యాపారులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం ఉదయం భగ్నం చేశారు. నిరశనకారులను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, వస్త్ర వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వస్త్ర వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Back to Top