వైయస్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు

హైదరాబాద్, జనవరి 24, 2013:

మచిలీపట్నం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య(నాని) గురువారం మధ్యాహ్నం చంచల్‌గుడా జైలులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని నాని ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబాన్ని కేంద్రం, కాంగ్రెస్, టీడీపీ కలిసి వేధిస్తున్నాయన్నారు. కష్టకాలంలో శ్రీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలకుంటున్నానని చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు, వైయస్ఆర్ అభిమానుల కోరికమేరకే తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు నాని వివరించారు. ఇంతవరకూ తాను మనసు చంపుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఎనిమిదినెలలుగా జైలులో ఉంచి, ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. డాక్టర్ వైయస్ఆర్ కుటుంబసభ్యులను ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నదీ ప్రత్యక్షంగా చూశానన్నారు. అంతకు ముందు ఆయన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పేర్ని నాని రెండుసార్లు బందరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అనుయాయిగా పేరొందారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ అయిన శ్రీ వైయస్  జగన్మోహన్ రెడ్డి గతంలో నిర్వహించిన లక్ష్య దీక్ష వరకూ నాని ఆయన వెంట ఉన్నారు. తదుపరి మారిన రాజకీయపరిస్థితుల్లో ఆయనకు ప్రభుత్వ విప్ పదవి లభించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఇప్పటికే శ్రీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు.

Back to Top