హైదరాబాద్‌ః తెలుగుదేశం అవినీతికి పరాకాష్టగా మారిన పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారంలో రోజుకో రంగు బయటపడుతోంది. ఇప్పటికే కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై 21.9 శాతం అధికానికి టెండర్ కట్టబెట్టిన సర్కారు దానికి కొనసాగింపుగా మరో అవినీతి వ్యవహారానికి తెరతీసింది. ఈ పథకంలో అవినీతి ప్రవాహానికి ఎలాంటి అవరోధాలూ తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.లిఫ్ట్ పనుల అడ్డగోలు బిల్లులు ఆటంకం లేకుండా అనుమతులు పొందేందుకు గాను అనుకూలంగా వ్యవహరించే అధికారులకు అధికారం అప్పగిస్తోంది.పట్టిసీమ పనులు పోలవరం కుడికాల్వ సర్కిల్ పరిధిలో ఉంటాయి. దానిని పోలవరం హెడ్‌వర్క్స్ పరిధిలోకి మారుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు చెప్పింది చెప్పినట్లుగా చేసే అధికారి రమేష్‌బాబు పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఈగా పనిచేస్తుండడమే దీనికి కారణం. పట్టిసీమ బిల్లుల విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండడం కోసమే... తక్షణమే ఆమోదముద్ర వేసే అధికారి పరిధిలోకి పనులను మార్చుతూ ఈ ఉత్తర్వులు ఇచ్చారన్నమాట.పోలవరం ఎస్‌ఈ రమేష్ బాబు వాస్తవానికి తెలంగాణకు ఎంపికయ్యారు. అయితే వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 186 మంది ఇంజనీర్లను తెలంగాణ ప్రభుత్వానికి సరెండర్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం రమేష్‌బాబును మాత్రం మినహాయించింది.ఎస్‌ఈగా రమేష్‌బాబు అక్కడ జరిగే నిర్మాణపనులను పర్యవేక్షించాలి. పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ సీఈ పర్యవేక్షించాలి. అయితే ఎస్‌ఈకే క్వాలిటీ కంట్రోల్ సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ పనిలో రమేష్‌బాబు కాకుండా వేరేవారు ఉంటే పనుల నాణ్యతను ప్రశ్నిస్తారన్న భయమే దీనికి కారణం.అంతేకాదు ఇదే రమేష్‌బాబుకి పోలవరం హెడ్‌వర్క్స్ సీఈగా కూడా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలా చేస్తే ఇక అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి కనుక తమ అడ్డగోలు బిల్లులకు అడ్డు ఉండదని వారు తలపోస్తున్నారని సమాచారం.నిజానికి పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో సీఈ పోస్లు ఉండదు. కానీ రమేష్‌బాబు కోసం ప్రత్యేకంగా సీఈ పోస్టు సృష్టించాలనే ప్రతిపాదన తయారు చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులంటున్నారు.