లక్ష కోట్ల బడ్జెట్...అంకెల గారడీయే

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీయే తప్ప ఆ అంకెల్లో ఎంత మాత్రమూ వాస్తవం లేదని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రూ. లక్ష కోట్ల ముసుగులో ప్రజలను మభ్యపెట్టే యత్నమే తప్ప, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది. వాస్తవ ఆదాయానికి, ప్రభుత్వ లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదని, ఒకవేళ ఆ లెక్కలు నిజమైతే శాఖల వారీగా ఆదాయాన్ని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించింది.

పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో కలసి వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిందని, రూ. లక్ష కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్ డొల్లతనం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పొంగులేటి అన్నారు. 'ప్రణాళికా వ్యయంలో రూ. 48,648 కోట్లు చూపారు. సమైక్య రాష్ట్రంలో 2012-2013 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ. 47,712 కోట్లను ప్రణాళికా వ్యయంలో కేటాయించారు. 2013-2014 ఏడాదికి ఆ మొత్తం ఇంకా తగ్గి రూ. 42,185 కోట్లుగా పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు మాత్రమే రూ. 48,648 కోట్లుగా బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. అదికూడా పది నెలల కాలానికి చెందిన బడ్జెట్ లోనే. ఈ లెక్కన 12 నెలలకు కలుపుకుంటే రూ. 52 వేల కోట్లకు పైమాటే. వీటన్నింటికి ఆదాయం ఎలా వస్తుందన్నదానిపై ప్రభుత్వం ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు.

సమైక్య రాష్ట్రంలో కేవలం 45 శాతం ఆదాయం మాత్రమే ఉన్న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఇంత ఆదాయం పెరిగిందా? ఒకవేళ పెరిగితే ఆ ఆదాయం, పద్దులు ఎందుకు వివరించలేదు.?' అని పొంగులేటి నిలదీశారు. 'ఇక కేంద్ర గ్రాంట్లు రూ. 21,720 కోట్లుగా బడ్జెట్ లో పేర్కొన్నారు. 2012-13 ఏడాదిలో 12 నెలల బడ్జెట్ కు గాను రూ. 7,412 కోట్లు, 2013-14లో రూ. 8,990 కోట్లు కేంద్ర గ్రాంట్లు వచ్చాయి. మరి ఇప్పుడు రూ. 21,720 కోట్లు కేంద్ర గ్రాంట్లు ఎలా సాధ్యం' అని ప్రశ్నించారు. ఇంతకంటే ఆశ్చర్యకరంగా తెలంగానలో తలసరి ఆదాయం రూ. 93,150గా బడ్జెట్ లెక్కల ద్వారా ప్రభుత్వం చెప్పిందని, ఇది దేశంలో ఆదాయ సూచిలో ముందున్నామని చెప్పుకుంటున్న గుజరాత్ తలసరి ఆదాయం కంటే రూ. 20 వేలు ఎక్కువని పేర్కొన్నారు.

వాస్తవ పరిస్థితుల ప్రకారం తెలంగాణ బడ్జెట్ రూ. 60-65 వేల కోట్లకు మించి పోయే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు లక్ష్యంగా ప్రజలను మోసం చేయచూడటం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అంకెల గారడీతో ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షనేత తాటి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ధోరణిని అసెంబ్లీ లోపల, బయట ఎండగడతామని హెచ్చరించారు. ఈ బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. శాఖల వారీగా లెక్కలు చూపమంటే అధికారపక్షం జావగారిపోతుందన్నారు.

Back to Top