హైదరాబాద్ :
పది కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణపై నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ పెను పాపానికి ఒడిగట్టిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన పాపంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికీ భాగం ఉందని ఆమె విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎవరినీ సంప్రదించకుండానే తీసేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆమె మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను తన సొంతింటి వ్యవహారంలాగా చేసింది. కాంగ్రెస్ నిర్ణయం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తెలంగాణ ఇచ్చేశామని ఒకే ఒకమాట చెప్పేసి మొత్తం రెండు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ పాపంలో చంద్రబాబుకూ భాగం ఉంది’ అని శోభా నాగిరెడ్డి అన్నారు.
లేఖ ఇచ్చి దులిపేసుకున్నారు :
చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ మాత్రమే ఇచ్చారని, ఒకవేళ విభజన జరిగితే ఆంధ్ర, రాయలసీమలకు ఎలా న్యాయం చేయాలో చెప్పలేదని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. అసలు ఈ విషయమై ఆయన ఒక్కమాటా మాట్లాడలేదని, నోరెత్తడం లేదని దుయ్యబట్టారు. సీమాంధ్రకు ఇంత అన్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమైతే దానిలో చంద్రబాబూ భాగస్వామి అని శోభా నాగిరెడ్డి అన్నారు. ఇరు ప్రాంతాలు నష్టపోయే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, తమ పార్టీలా బాబు కూడా ముందుకొచ్చి కేంద్రాన్ని నిలదీసి ఉంటే ఇంత సులభంగా నిర్ణయం తీసుకుని ఉండే వారు కాదన్నారు. సొంత ఇంటి వ్యవహారంగా సోనియాగాంధీ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో తగిన మూల్యం చెల్లిస్తుందని ఆమె అన్నారు. ఒక ప్రాంతాన్ని విడదీయాలనుకుంటే ఇతర ప్రాంతాలకు ఎలా న్యాయం చేస్తారో చెప్పలేదన్నారు. నీరు, విద్యుత్ వంటి సమస్యలతో పాటుగా హైదరాబాద్‌పై ఏ నిర్ణయం తీసుకునేదీ ముందు చెప్పలేదన్నారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను భవిష్యత్ తరాలు క్షమించవు:
హైదరాబాద్ నగరాన్ని అన్ని ప్రాంతాల వారూ కలిసి అభివృద్ధి చేశారని, ఎవరు సిఎం అయినా హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. అలాంటి హైదరాబాద్‌ను ఏకపక్షంగా తెలంగాణకు ఇస్తామని చెప్పి ఇతర ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తప్పకుండా నిలదీయాల్సి ఉందన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధులు కేవలం సోనియా మెప్పు పొందడానికో, పదవులు కాపాడుకోవడానికో నోరు మెదపకుండా ఉన్నారని, వారిని భావితరాలు క్షమించబోవని హెచ్చరించారు. తమలాగా కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు కూడా నిలదీసి ఉంటే ఇలాంటి నిర్ణయం వచ్చి ఉండేది కాదన్నారు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా ముందుగానే అడిగేవారన్నారు. ఇదంతా కాంగ్రెస్, టిడిపి వైఖరి వల్లనే జరిగిందన్నారు.
రెండు ప్రాంతాలకు న్యాయం ఎలా చేయబోతున్నారో ముందుగా చెప్పి ఆ తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలని శోభా నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు సీమాంధ్రకు ఏం చేస్తారని కూడా అడగలేని నిస్సహాయ స్థితిలో ప్రధాన విపక్ష నేత ఈ రాష్ట్రానికి ఉండటం దౌర్భాగ్యం అని ఆమె నిప్పులు చెరిగారు. కేవలం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, ఆయనను రాజకీయంగా ఎలా దెబ్బతీయాలా, ఏ విధంగా కుట్రలు పన్నాలా అనే విషయాలపైనే చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారని విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలకు తీరని ద్రోహం చేశారని ఆమె విమర్శించారు. తాను నోరు మెదపకుండా ఉండటమే కాక సొంత పార్టీ వారిని సైతం ఏమీ మాట్లాడ వద్దని బాబు ఆంక్షలు విధించారన్నారు. మౌనంగా ఉండటం ద్వారా రెండు ప్రాంతాల్లోనూ రాజకీయంగా లబ్ధి పొందుతానని, ఇపుడు సర్పంచ్ పదవులు గెలిచానని బాబు చెప్పుకుంటూ ఉండొచ్చు కానీ, రెండు చోట్ల కాళ్లు పెట్టిన బాబు ఎన్నికల్లో మునగడం ఖాయమని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.