షర్మిలకు ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల బ్రహ్మరథం

ఇడుపులపాయ, 18 అక్టోబర్‌ 2012: సమస్యలతో అల్లాడిపోతున్న ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ట్రిపుల్‌ ఐటి విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. ఇడుపులపాయ నుంచి గురువారం షర్మిల పాదయాత్ర ప్రారంభించి ట్రిపుల్‌ ఐటికి చేరుకున్నారు. ట్రిపుల్‌ ఐటి విద్యార్థులతో షర్మిల ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మహానేత వైయస్‌ఆర్ ఉన్నప్పుడు తమ బాగోగుల గురించి అనుక్షణం ‌అడిగి ఆరా తీసేవారని విద్యార్థులు షర్మిలకు చెప్పారు. వైయస్ స్మరణానంతరం తమ సమస్యలను పరిష్కరించే నాధుడే కరవయ్యాడని ‌వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కళాశాలలో కనీసం ఫ్యాకల్టీ, ల్యాబ్ సదుపాయం కూడా ‌లేదని చెప్పారు. విద్యార్థుల కష్టాలపై స్పందించిన షర్మిల పేద పిల్లలపైన కిరణ్ ‌ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ప్రశ్నించారు.

Back to Top