కరీంనగర్: త్వరలో కరీంనగర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ కోసం ప్రాణాలు కోల్పోయిన 30 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పొంగులేటి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీలను విస్మరించిందని పొంగులేటి విమర్శించారు. ఏపీలో కూడా టీడీపీ సర్కార్ మాటలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలకు సిద్ధ శుద్ధి ఉంటే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి నుంచి జరిగి పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ శాసన సభను శాసిస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నేటి తీర్మానంలో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా జాతీయ హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తీర్మానించింది.