'సహకార ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ'

గంగాధర నెల్లూరు:

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి, మిట్టపల్లె, వెజ్జుపల్లె, పాపిరెడ్డిపల్లె గ్రామాల్లో సింగిల్ విండో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగాధర నెల్లూరు సింగిల్ విండో ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సింగిల్ విండో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పోలీసుల్ని పావుగా వాడుకుని తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. తమ మద్దతుదారుల నామినేషన్లు సక్రమంగా ఉన్నా కూడా తిరస్కరించారని ఆరోపించారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌  రెడ్డి ముఖ్యమంత్రయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడిందని చెప్పారు.

Back to Top