ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం

హైదరాబాద్, 21 సెప్టెంబర్‌ 2012: ప్రజల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు పి.విజయారెడ్డి నిప్పులు చెరిగారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుని సామాన్యుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల తీరుతో ప్రజల జీవితాలు కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన డీజిల్‌ ధరలు, వంటగ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీపై పరిమితి విధించడాన్ని, చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించడానికి నిరసనగా గురువారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన బంద్‌లో భాగంగా విజయారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్సు చెక్‌పోస్టు వద్ద వందలాది మంది కార్యకర్తలతో ఆందోళన, రాస్తారోకో నిర్వహించారు.

పెంచిన డీజిల్‌ ధరను తక్షణమే తగ్గించాలని, గ్యాస్‌ సిలిండర్లపై పరిమితిని ఎత్తివేయాలని, రిటెయిల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జూబ్లీహిల్సు పోలీస్‌ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు గోవర్దన్‌, అరుణ్‌, లక్ష్మారెడ్డి, కృష్ణారావు, సత్యనారాయణగౌడ్‌, ప్రభాకర్‌, ఆనంద్‌, నరేశ్‌, ఇషాక్‌, కిరణ్‌, రవి, బాలకృష్ణ, ఒ. వెంకట్‌, ‌ఒ. శ్రీను, పీటర్‌ తదితరులు పాల్గొన్నారు.

మోటార్‌సైకిల్‌ ర్యాలీ :
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్సు నియోజకవర్గంలో గురువారంనాడు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరలను ఇష్టం వచ్చినట్లుగా పెంచుకుంగూ పోతోందని ఈ సందర్భంగా మాట్లాడిన వినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల పార్టీ కన్వీనర్లు మహ్మద్‌ దస్తగిర్‌, ఎహెచ్‌ రాజేందర్‌సింగ్‌, నాయకులు దినకర్‌, బుజ్జి నాయక్‌, ప్రవీణ్‌, వెంకట్‌రెడ్డి, చోటు, మహేశ్‌, ముజిబ్‌, భాస్కర్‌, శ్రీధర్‌యాదవ్‌, ఖాదర్‌, అర్షద్‌, వెంకట్‌, ఖదిర్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top