ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

తిరుపతి:

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం వారిపై పన్నులు, అధిక ధరలు, కరెంట్ చార్జీల రూపంలో మోయలేని భారం మోపుతోందని మండిపడ్డారు.  రాజీవ్‌నగర్ పంచాయతీ పరిధిలోని శ్రీరామనగర్‌లో ఎమ్మెల్యే ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు రోడ్లు, వీధి దీపాలు, తాగు నీరు, డ్రైనేజి తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. మున్సిపాలిటీ సరిహద్దునే ఉన్న శ్రీరాంనగర్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

      గత ఆరు మాసాలుగా ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానని, వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నానన్నారు. ఆయితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని భూమన దుయ్యబట్టారు. సమస్యలను పరిష్కరించక పోగా డీజిల్, పెట్రోల్ కిరోసిన్ వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల జీవనాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తోందన్నారు.

Back to Top