అర్హులకు అందని ఆసరా పెన్షన్లు

ఇష్టారాజ్యంగా జన్మభూమి కమిటీ ఆగడాలు
బనగానపల్లె : అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బనగానపల్లె మండలం పలుకూరు గ్రామ వైయస్‌ఆర్‌ సీపీ నేత గుండం శేషిరెడ్డి మండిపడ్డారు. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.  గ్రామానికి చెందిన 40 సంవత్సరాల వయస్సుగల షేక్‌ మదార్‌సాహెబ్‌ పుట్టుకతో అంధుడని, ప్రతి రోజు బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్‌లో పాటలుపాడుతూ ప్రయాణీకులు ఇచ్చే చిల్లర డబ్బులతో గత 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలిసినా ఇప్పటికీ అతనికి పెన్షన్‌ మంజూరు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటువంటి సంఘటనలు గ్రామంలో కోకొల్లలుగా ఉన్నాయన్నారు.  గతనెలలో గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామానికి 132 కొత్త పింఛన్లు మంజూరైనట్లు జాబితా మంజూరైనా అందులోనుంచి వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు దారులను తొలగించి టీడీపీ కార్యకర్తలను 62 మందిని చేర్చారన్నారు. వెంటనే జన్మభూమి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకొని అర్హులైన వారికి పెన్షన్లు అందేలా చూడాలని కోరారు. 
Back to Top