నా పాటతో వైయస్‌ను స్మరించుకోవడం అదృష్టం: ఆర్పీ

మచిలీపట్నం: దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డిని నా పాటలతో స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. పట్టణంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ. తాను ఆలపించిన ‘పెద్దాయన... పెద్దాయన...’ పాట ఇటీవల ‘సాక్షి’ టీవీ ద్వారా ప్రాచుర్యంలోకి రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. జెమిని చిత్రంలోని ‘చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు’, ‘ఆ నలుగురు’లో ‘ఒక్కడై రావడం’ అనే పాటలతో వైయస్‌ను స్మరించుకోవడం తృప్తినిస్తోందన్నారు. ప్రస్తుతం తాను ‘ఏమి’ అనే హాలివుడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నానని చెప్పారు.

సభ్యత్వ నమోదులో మన సత్తా చాటుదాం

కడప: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వైయస్‌ఆర్ జిల్లా మిగతా జిల్లాలు అందుకోలేనంత స్థాయికి చేరుకుని సత్తా చాటాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అపూర్వ కల్యాణమండపంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల కన్వీనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు 8శాతమే పూర్తయిందన్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో అయినా పార్టీ టికెట్ రావాలంటే క్రియాశీలక సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలన్నారు. 2014 ఎన్నికలలో పార్టీ 200 సీట్లు గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తంచేశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, జిల్లావ్యాప్తంగా మన పార్టీ తరపున పోటీ చేసినవారే ఆ ఎన్నికల్లో గెలిచే అవకాశముందన్నారు. సొంత పనులు పక్కనబెట్టి ఈనెల 15వ తేది నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుతాం

కర్నూలు: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, జిల్లా నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 14 నెలలుగా ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనూ ఎన్నికలు నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి లేదని.. ఏదో ఒక సాకుతో మళ్లీ కోర్టును ఆశ్రయిస్తుందని విమర్శించారు. ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఉనికి కోల్పోవడం తథ్యమన్నారు.

మంత్రులకు రైతుల గోస పట్టదా?: జగపతి

నర్సాపూర్: మెదక్ జిల్లాలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నా జిల్లాకు చెందిన మంత్రులకు పట్టడంలేదని వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి మండిపడ్డారు. మంగళవారం ఆయన నర్సాపూర్ వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. వర్షాభావం వల్ల 25 శాతమే వ్యవసాయం సాగు చేస్తున్నా సరిపడ యూరియా సరఫరా చేయకపోవడం విచారకరమన్నారు. వ్యవసాయ రంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. ప్రజల సంక్షేమాన్ని సర్కార్ విస్మరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు గతంలో ఏనాడు లేవని బట్టి అన్నారు. ‘అధికారులు మంత్రుల మాట వినరు, మంత్రులు సీఎం మాట వినరు, ఎవరిష్టమున్నట్లు వారు వ్యవహరిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

ఫీజు దీక్షను విజయవంతం చేయాలి

సంగారెడ్డి: హైదరాబాద్ ఇందిరా పార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఈ నెల 6, 7 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టే ‘ఫీజు దీక్ష’ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజులు పూర్తిగా చెల్లించాలని, ‘పెద్ద చదువులు.. పేదలందరి హక్కు’ అనే నినాదంతో విజయమ్మ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తలు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Back to Top